-->

తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

నేడో, రేపో పార్లమెంట్‌లో బిల్లు
ప్రతిపక్షాలతో చర్చలు
రేపు భాజపా నేతలకు ప్రధాని విందు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 (జనంసాక్షి) :
తెలంగాణ బిల్లు (ఆంధప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు)కు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి భవన్‌ గడపదాటిన బిల్లు పార్లమెంట్‌ ముంగిట చేరింది. దీంతో బిల్లుపై కేంద్రప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. మంగళ, బుధవారాల్లో బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలనే యోచనలో కేంద్రం ఉంది. మొదట మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ బిల్లును రాజ్యసభలో బిల్లు పెట్టాలని నిర్ణయించినా, భవిష్యత్‌లో ఏవైనా సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నిర్దిష్టమైన ప్రణాళికతోనే బిల్లును తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. కేంద్ర మంత్రి మండలి గత శుక్రవారం ఆమోదించిన ఈ బిల్లును ప్రధాని కార్యాలయం ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి కార్యాలయానికి పంపిన విషయం తెలిసిందే. బిల్లును రాష్ట్రపతి పరిశీలించిన తరువాత ఈ ఉదయం సంతకం చేశారు. బిల్లు పెట్టే విషయాన్ని రాజ్యసభ చైర్మన్‌ కార్యాలయం కూడా ధ్రువీకరించింది. అయితే చివరిక్షణంలో కేంద్రం వ్యూహం మార్చుకున్నట్టు తెలిసింది. టీ బిల్లుకు రాష్ట్రపతి ఓకే చెప్పారని, ముందుగా చెప్పినట్లు కాకుండా ఒక రోజే ముందే పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఆయన తెలిపారు. ఇదే విషయంపై రాజ్యసభ ఛైర్మన్‌ అన్సారీతో మంత్రులు కమల్‌నాథ్‌, షిండే, జైరాం రమేశ్‌ సమావేశం అయ్యారు. అలాగే రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీతో కూడా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌ భేటీ అయి బిల్లుకు సహకరించే విషయంపై చర్చించారు. 17 లేదా 18 తేదీల్లో తెలంగాణ బిల్లు లోకసభకు వచ్చే అవకాశాలున్నాయి. ఇదిలావుంటే తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో తెలంగాణవాదులు హర్షం వ్యక్తం చేశారు. బిల్లు పాస్‌ అయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ జేఏసీ ఇప్పటికే ఢిల్లీలో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తోంది. తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి గ్రీన్‌ సిగ్నలివ్వడంతో టీ జేఏసీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, బిల్లుపై సభలో చర్చించవలసిన వ్యూహంపై కాంగ్రెస్‌ నేతలు చర్చిస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ ఇతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే బిల్లు సభలో ప్రవేశపెట్టే విషయమై రాజ్యసభలో విపక్ష బిజెపి నేత అరుణ్‌జైట్లీతో కమల్‌నాథ్‌ చర్చలు జరిపారు. బిల్లు విషయం చర్చించేందుకు రాజ్యసభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీతో కేంద్ర మంత్రులు సుశీల్‌ కుమార్‌ షిండే, కమల్నాథ్‌, జైరామ్‌ రమేశ్‌ సమావేశమయ్యారు. ఈ బిల్లు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ వేగంగా ముందుకు కదులుతోంది. వాస్తవానికి కాంగ్రెస్‌ అధిష్టానం నేతలు ముందు చెప్పన ప్రకారం ఈ నెల 12న అంటే బుధవారం రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టవలసి ఉంది. ఈ బిల్లుకు సంబంధించిన చర్చలతో ఢిల్లీ వేడెక్కింది. ఉదయం నుంచి దేశరాజధానిలో అధికార, ప్రతిపక్ష నేతల చర్చలు, సమైక్యాంధ్ర-తెలంగాణవాదుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు సుశీల్‌ కుమార్‌ షిండే, దిగ్విజయ్‌ సింగ్‌ సమావేశమై పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో దిగ్విజయ్‌ సింగ్‌ భేటీ కావడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఉభయ సభల్లో విపక్ష బిజెపి నేతలు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీలతో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సమావేశం కావడం, తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదం, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ అరుణ్‌జైట్లీతో చర్చలు, రాజ్యసభ చైర్మన్‌ హవిూద్‌ అన్సారీతో కేంద్ర మంత్రులు సుశీల్‌ కుమార్‌ షిండే, కమల్నాథ్‌, జైరామ్‌ రమేష్ల భేటీ ఇలా పనులన్నీ చకచకా సాగుతున్నాయి. .ఉభయ సభలలో బిల్లు ఆమోదం పొందేందుకు కాంగ్రెస్‌ సర్వవిధాల ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా, రాష్ట్ర విభజన పక్రియ తుదిదశకు చేరుకోవడంతో సీమాంధ్ర, తెలంగాణవాదుల ఆందోళన ఉధృతమైంది. విభజనకు వ్యతిరేకంగా ఏపీభవన్‌ వద్ద ఆందోళన చేస్తున్న ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. మరోవైపు టిజాక్‌ ఆధ్వర్యంలో ఎపి భవన్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆందోళన కొనసాగించారు. ఎపి ఎన్జీవోలు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మరోవైపు బిల్లును అడ్డుకునే క్రమంలో చంద్రబాబు కోల్‌కతా వెళ్లి మమతా బెనర్జీని కలిశారు. అలాగే అక్కడి నుంచి హుటాహుటినపి ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు సోమవారం ఉభజయసభల్లోనూ రగడ కొనసాగి సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.
తెలంగాణ బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు స్వయంగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రంగంలోకి దిగారు. బహుశా ఈ సమావేశాల్లోనే బిల్లు ఆమోదానికి కాంగ్రెస్‌ కృతనిశ్చయంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈమేరకు ఈనెల 12న రాత్రి ప్రధాని బీజేపీ అగ్రనేతలకు విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ద్వారా బిల్లుకు మద్ధతు కూడగట్టాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇప్పటికే వెంకయ్యనాయుడును అహ్మద్‌పటేల్‌, దిగ్విజయ్‌సింగ్‌ కలిశారు. మరోవైపు అందరి సహకరాం కోరుతామని ప్రధాని ఇప్పటికే ప్రకటించారు. ఇదిలావుంటే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను సోనియాకు టీఎస్‌ఆర్‌ వివరించినట్లు సమాచారం. అలాగే తనను రాజ్యసభకు నామినేట్‌ చేసినందుకు కృతజ్ఞతుల తెలుపుకున్నారు. మరోవైపు పిసిసి మాజీ చీఫ్‌ డీఎస్‌ కూడా సోనియాతో భేటీ అయ్యారు. వివిధ అంశాలతో పాటు తెలంగాణపై కూడా ఆయన మేడమ్‌తో చర్చించారని సమాచారం. మరోవైపు కేంద్ర¬ంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌ భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్‌లో నెగ్గించుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే అనుసరించాల్సిన పద్ధతులను కూడా చర్చించారని సమాచారం. ఇదిలావుంటే తెలంగాణ ప్రాంత మంత్రులు సీఎంకు సహకరించాలని కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్‌ నేత ప్రకాశ్‌ జవదేకర్‌ మండిపడ్డారు. తెలంగాణ మంత్రులు సీఎంకు సహకరించాలని దిగ్విజయ్‌ కోరడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ బిల్లుపై గందరగోళం సృష్టిస్తున్నదంతా కాంగ్రెస్‌ అధిష్ఠానమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేతలపై కాంగ్రెస్‌ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర కేబినెట్‌ భేటీకి తెలంగాణ మంత్రులు హాజరుకావాలని, ఓటాన్‌ అకౌంట్‌కు సహకరించాలని దిగ్విజయ్‌సింగ్‌ తెలంగాణ మంత్రులను కోరిన విషయం తెలిసిందే. మొత్తానికి రాజ్యసభలో మంగళవారం బిల్లు పెట్టేందుకు కాంగ్రెస్‌ సిద్దం అవుతున్నట్లు స్పష్టం అవుతోంది. బిల్లుపై కృతనిశ్చయంతో ఉన్న కాంగ్రెస్‌ అధిష్ఠానం బహుముఖ వ్యూహంతో ముందుకు వెళుతోందని తెలిసింది. ఇందులో భాగంగా బీజేపీతో చర్చలు జరిపి సాఫీగా ఆమోద పక్రియ జరిగేలా చూడడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలు సైతం అన్వేషిస్తున్నది. బీజేపీతో సాధ్యమైనంత వరకూ పట్టు-విడుపులు ప్రదర్శించాలని, సవరణల విషయంలో ఉదారంగా ఉండాలని కూడా కాంగ్రెస్‌ భావిస్తున్నది. అయినా సహాయ నిరాకరణ కనుక ఎదురైన పక్షంలో బీజేపీ మద్దతు లేకుండానే బిల్లును గట్టెక్కించే వ్యూహాన్ని సైతం సిద్ధం చేసినట్టు- తెలిసింది. ఇందుకోసం ఎన్డీయేతర పక్షాలతో పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది.తెలంగాణ ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు మంగళవారం పార్లమెంటుకు చేరనుంది. అదేరోజు రాజ్యసభలో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 18న లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశముంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలనుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. బిల్లుకు రాష్ట్రపతి సోమవారం ఆమోదం తెలిపే అవకాశం ఉందని భావిస్తున్నారు. అది పూర్తికాగానే మంగళవారం రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తు న్నారు. ప్రధాని, ¬ంమంత్రి చేస్తున్న కసరత్తు దీనినే సూచిస్తున్నాయి. కేంద్ర కేబినెట్‌ శుక్రవారంనాడు ఆంధప్రదేశ్‌ పునర్వ్యవస్తీకరణ బిల్లు-2014కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆ బిల్లును పార్లమెంటు-లో ప్రవేశపెట్టాలని సిఫార్సు చేస్తూ ఆమోదం కోసం ఆదివారం నాడు ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి పంపించారు. ఉభయసభల్లో బిల్లు సాఫీగా ఆమోదింపజేసేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రంగంలోకి దిగారు. లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్షనేతలు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌ జైట్లీలతో విదంఉ సమావేవం ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష బీజేపీని ఒప్పించి మెప్పించడం ద్వారా బిల్లును గట్టెక్కించాలని ప్రభుత్వం, కాంగ్రెస్‌ అధిష్ఠానం స్థిర నిశ్చయంతో ఉన్నాయి. బీజేపీతో పట్టువిడుపుల ధోరణి ప్రదర్శించి అవసరాన్ని బట్టి మరిన్ని సవరణలకు కూడా అంగీకరించాలని కాంగ్రెస్‌ భావిస్తున్నది. సీమాంధ్ర ఎంపీలనుంచి తీవ్ర వ్యతిరేకత నెలకొన్న దష్ఠ్యా ప్రభుత్వం ముందునుంచీ తన వ్యూహాన్ని రహస్యంగానే ఉంచుతూ వస్తోంది. రాజ్యసభలో ఈ బిల్లు ప్రవేశ పెట్టడం ద్వారా ఒకవేళలోక్‌సభ ఏ కారణం వల్ల రద్దయినా బిల్లును సజీవంగా ఉంచే అవకాశం ఏర్పడుతుంది. కాగా రాష్ట్ర అసెంబ్లీకి పంపిన బిల్లునే యథాతథంగా పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దీనికి 32 సవరణలను ప్రభుత్వం అధికారికంగా ప్రతిపాదించనుంది. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని సీమాంధ ప్రాంతం నుంచి బలమైన డిమాండ్లు వచ్చినా ప్రభుత్వం దానికి తిరస్కరించింది. 15వ పార్లమెంటు కాలపరిమితి పూర్తి కావొస్తున్న తరుణంలో బిల్లు ఆమోద పక్రియను ముమ్మరం చేయాలని కోర్‌కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఆంధప్రదేశ్‌ అసెంబ్లీలో ఈ బిల్లును తిరస్కరిస్తూ చేసిన తీర్మానాన్ని పట్టించుకోరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టికల్‌ -3 ప్రకారం పార్లమెంటుకు ఈ విషయంలో సర్వాధికారాలున్నందున ముందుకే వెళ్లాలని ప్రభుత్వం భావించింది. అయితే ఫిబ్రవరి 5న ప్రారంభమైన నాటినుంచి పార్లమెంటు సమావేశాలు స్తంభిస్తూ వస్తున్నాయి. సీమాంధ్రకు చెందిన ఎంపీలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు కూడా ఇస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రయత్నాలు ఫలించి ఇతర పార్టీల మద్దతు లభిస్తే తెలంగాణ విషయంలో తమకు చుక్కెదురు తప్పదని బీజేపీ భావించేలా కాంగ్రెస్‌ కొత్త ఎత్తుగడలు పన్నుతోంది.