నీవు నేర్పిన విద్యే
లోక్‌సభలో రేపు టీ బిల్లు
ద్రవ్యబిల్లే అని తేల్చిన న్యాయశాఖ
వీలైతే ఓటింగ్.. సహకరించకపోతే మూజువాణి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు లోపభూయిష్టంగా ఉందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూజువాణి ఓటుతో దాన్ని తిప్పి పంపడానికి తీర్మానం చేయించాడో అదీ విధంగా పార్లమెంట్‌లో బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వం వ్యూహ రచన చేస్తోంది. తెలంగాణ ముసాయిదా రాజ్యాంగంలోని ఆర్టికల్ 119(1) కింద ద్రవ్యబిల్లేనని కేంద్ర న్యాయ శాఖ తేల్చడంతో బిల్లును మొదట లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్రపతిని ఆమోదం కోరగా ఆయన అందుకు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. బుధవారం రైల్వే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో గురువారం లోక్‌సభలో బిల్లును టేబుల్ చేసి ఈనెల 18న తర్వాత వీలైతే చర్చించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఒకవేళ చర్చకు ఆస్కారం లేకుంటే బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదింపజేసుకునేందుకు కేంద్రం సన్నద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ ముసాయిదా-2014ను మంగళవారమే రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి అనుమతి తెలిపినా అత్యంత నాటకీయ పరిణామాల మధ్య బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం వాయిదా వేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆర్థికపరమైన అంశాలతో కూడుకున్నది కాబట్టి ద్రవ్యబిల్లును పెద్దల సభలో ఎలా ప్రవేశపెడతారానే ప్రశ్న ప్రతిపక్షాల నుంచి తలెత్తింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం న్యాయ సలహా కోరింది. తెలంగాణ బిల్లు ఆర్థికపరమైన బిల్లు కిందికి వస్తుందా రాదా అంటూ న్యాయశాఖను సలహా అడిగింది. న్యాయశాఖ తన నివేదికను మంగళవారం సమర్పించింది. మొదట బుధవారమే బిల్లును సమర్పించాలని హోం శాఖ వర్గాలు భావించిన రైల్వే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నేపథ్యంలో దానిని గురువారానికి వాయిదా వేసుకున్నారు. బిల్లును టేబుల్ చేసుకున్న తర్వాత 17న కేంద్ర ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి, 18 నుంచి తెలంగాణపై చర్చకు కేంద్రం సిద్ధమవుతోంది. ‘కాన్సాలిడేటెడ్ ఫండ్’కు సంబంధించిన ప్రస్తావన ఉండటంతో… పునర్విభజన బిల్లును ద్రవ్య బిల్లుగా రాజ్యసభ పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం ద్రవ్య బిల్లు ఏదైనా తొలుత లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి. దీంతో విభజన బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టడం కుదరదని స్పష్టమైంది. అయితే ప్రభుత్వంలోని కొందరు రాష్ట్ర విభజన బిల్లు ద్రవ్యబిల్లు కాదని వాదిస్తున్నారు. ఇదిలావుంటే తెలంగాణ బిల్లు మళ్లీ రాష్ట్రపతి వద్దకు వెళ్లింది. తెలంగాణ బిల్లును మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినా అందుకు రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ అభ్యంతరం తెలిపారు. బిల్లులో ఆర్థికాంశాలు ఉన్నందున సభలో ప్రవేశపెట్టలేమని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన కేంద్ర న్యాయశాఖ సలహా కోరారు. టీ బిల్లులో ఆర్థికాంశాలు ఉన్నందును ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టడం కుదరదని న్యాయశాఖ తెలిపింది. ఆ శాఖ సలహా మేరకు ఛైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్సారీ అభ్యంతరంతో కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుంది. తెలంగాణ బిల్లుకు ఎలాంటి అడ్డంకి తలెత్తకుండా సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతూ, సొంతపార్టీపైనే అవిశ్వాసం పెట్టిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలను అధిష్టానం పార్టీ నుంచి వెలివేసింది. బీజేపీతో తరచూ టచ్‌లో ఉంటూ బిల్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్లమెంట్ ఆమోదం పొందేందుకు చర్యలు తీసుకుంటుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కేంద్ర హోం మంత్రి షిండేను బిల్లు గురించి ఆరా తీశారు. ఎలాగైనా బిల్లు ఆమోదం పొందడంతో పాటు తర్వాత కూడా ఎలాంటి చిక్కులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే పార్లమెంట్ సమావేశాలు ముగియడానికి ఏడు రోజులే సమయముండటంతో తెలంగాణ బిల్లులతో పాటు ఇతర బిల్లులను ఆమోదింపజేసుకోవడంపై యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్ దృష్టి సారించారు. ఆయా బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందడం కోసం సీనియర్ మంత్రులు విపక్ష నాయకులతో వరుసగా భేటీ అవుతున్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్ బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, సీనియర్ నాయకులు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీని బుధవారం విందుకు ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని నివాసంలో భేటీ అయిన కోర్ కమిటీ తెలంగాణతో పాటు ఇతర బిల్లుల ఆమోదానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ సమావేశం అనంతరం సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌తో భేటీ అయ్యారు. ఆరుగురు ఎంపీల నిర్ణయాన్ని ఆమెకు తెలియజేశారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లుపై చర్చకు మూడు నుంచి నాలుగు గంటల వరకు సమయం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.