అడుగుదూరంలో
నేడు సభలో తెలంగాణ బిల్లు
ముంపు గ్రామాలే సీమాంధ్రకు
స్వల్ప మార్పులు చేర్పులు
రాజ్యాంగ సవరణ అక్కర్లేదు
సాధారణ మెజార్టీ సరిపోతుంది
ఆర్టికల్ 3, 4 అవే చెప్తున్నాయి : న్యాయశాఖ
డెప్యూటీ స్పీకరే తెలంగాణ సభాపతి
మండలి డెప్యూటీ చైర్మనే తెలంగాణకు చైర్మన్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు నేడు పార్లమెంట్ ముందుకు రానుంది. కేంద్ర ప్రభుత్వం ఈమేరకు బుధవారం కీలకమైన అంశాలను పరిష్కరించింది. గురువారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత లోక్‌సభలో కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలంగాణ బిల్లును ప్రవేశపెడతారు. తుది ముసాయిదాకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. బుధవారం సాయంత్రం ప్రధాని మన్మోహన్‌సింగ్ నివాసంలో జరిగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందడానికి కావాల్సిన అంశాలపై లోతుగా చర్చింగారు. మొదట ఖమ్మం జిల్లాలోని పాల్వంచ, భద్రాచలం రెవెన్యూ డివిజన్లలోని ఏడు మండలాలలను కొత్తగా ఏర్పడే అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కలపాలని నిర్ణయించగా, ఆ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకరాగా దానిని పున: సమీక్షించారు. పోలవరం నిర్మాణం వల్ల ముంపునకు గురయ్యే 134 గ్రామాలను మాత్రమే సీమాంధ్రలో కలపాలని నిర్ణయం తీసుకున్నారు. అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంతో పాటు కొత్త రాజధాని నిర్మాణాన్ని సవరణల్లో ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డెప్యూటీ స్పీకర్‌కు కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా, మండలి వైస్ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా కొనసాగుతారంటూ సవరణల్లో ప్రతిపాదించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రాజ్యాంగ సవరణ అక్కర్లేదని కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. పార్లమెంట్ లో సాధారణ మెజార్టీ ద్వారా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చని న్యాయశాఖ లోకసభ సెక్రటేరియట్‌కు బుధవారం ఉదయం వెల్లడించింది. రాజ్యంగంలోని ఆర్టికల్ 3, 4(2) ప్రతిపాదకగా తీసుకోవాలని న్యాయశాఖ వెల్లడించింది. ఆంధప్రదేశ్ విభజనకు సాధారణ తీర్మానం మాత్రమే అవసరమని కేంద్ర కేబినెట్ కు ఇదివరకే మంత్రుల బృందం తెలిపిందని లోకసభ సెక్రెటేరియట్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే తెలంగాణలో శాసన మండలికి మాత్రం మూడింట రెండొంతుల మెజార్టీ అవసరమని న్యాయశాఖ తెలిపింది. అయితే ప్రస్తుత రాష్ట్ర విభజనకు 29వ రాష్ట్ర ఏర్పాటుకు ఎలాంటి రాజ్యాంగ సవరణలు అక్కర్లేదని ఓప్రశ్నకు న్యాయశాఖ అధికారులు జవాబిచ్చారు. ఈ నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2013-14 ను ఆమోదించిన తర్వాతనే ఫిబ్రవరి 18న తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు- తెలుస్తోంది. 15 లోకసభ ముగింపుకు మూడు రోజుల ముందు మాత్రమే తెలంగాణ బిల్లు సభలో ప్రవేశపెట్టే పరిస్థితుల కనిపిస్తున్నాయని పీటీఐ కథనంలో వెల్లడించింది. మరోవైపు మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా బుధవారం ప్రధాని బిజెపి పెద్దలకు తన ఇంట్లో విందు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానితో విందు సమావేశంలో పాల్గొన్న బీజేపీ అగ్రనేతలు టీ- బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటిట్తూనే సీమాంధ్రకు న్యాయం చేయాలని పలు సూచనలు చేసినట్లు సమాచారం. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, కొత్త రాజధానిని వెంటనే ప్రకటించాలని ప్రధానితో బీజేపీ నేతలు తేల్చిచెప్పినట్లు సమాచారం. విూ మంత్రుల్ని, ఎంపీలను అదుపులో ఉంచుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని వారు ప్రధానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు బిల్లును అడ్డుకుంటున్న చంద్రబాబు తీరును తెలంగాణ లాయర్ల ఫోరమ్ తప్పు పట్టింది. తెలంగాణ బిల్లు విషయంలో రాజ్యాంగ సవరణ అవసరం లేదని కేంద్ర న్యాయశాఖ అభిప్రాయపడింది. పార్లమెంటులో సాధారణ మెజారిటీతో కొత్త రాష్ట్రం ఏర్పడుతుందని న్యాయశాఖ తెలిపింది. అయినా బాబు అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణకు అడ్డుపడుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా గురువారం తెలంగాణలోని అన్ని కోర్టుల్లో విధుల బహిష్కరణకు టీ లాయర్ల జేఏసీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముట్టడిస్తామన్నారు. జిల్లాల్లో స్థానికంగా అన్ని టీడీపీ క్యారాలయాల ముట్టడి ఉంటుందని వారు పేర్కొన్నారు.