పెప్పర్ స్ప్రేతో పొన్నంకు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
న్యూఢిల్లీ : లోక్‌సభలో గురువారం ఉదయం విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చేయడంతో కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అస్వస్థతకు గురయ్యారు. మొదట ఆయనకు పార్లమెంట్ ఆవరణలోని ఆస్పత్రిలో చికిత్స అందించి అక్కడి నుంచి రామ్ మనోహర్‌లోహియా ఆస్పత్రికి తరలించారు. పొన్నంతో పాటు తెలంగాణ ఎంపీలు మందా జగన్నాథం, డాక్టర్ వివేక్‌తో పాటు మంత్రి బలరాం నాయక్ అస్వస్థతకు లోనయ్యారు. వీరితో పాటు పలువురు ఎంపీలు పెప్పర్ ఘాటు తట్టుకోలేక సభ నుంచి బయటకు పరుగులు తీశారు. ఎంపీల ఆందోళనలో అస్వస్థతకు గురైన మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ (టీడీపీ) ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా పార్లమెంటులో తీవ్ర అస్వస్థతకు గురైన కొనకళ్ల నారాయణను రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. గుండెపోటుతోను, అధిక రక్తపోటుతోను బాధపడుతున్న ఆయన్ను ఐసియులో ఉంచి వైద్య సేవలు అందించారు. అనంతరం వెలుపలకు వచ్చిన మరో ఎంపి రమేష్‌రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆయన క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. త్వరగానే కోలుకుంటారని తెలియజేశారు. ఎవరూ కంగారుపడొద్దు చెప్పారు.