మద్దతుపై మాట మార్చొద్దు


సుష్మాకు కోదండరామ్‌ వినతి
ఇక కలుసుండే ముచ్చటేలేదు : కోదండరామ్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుపై మాట మార్చొద్దని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ బీజేపీ లోక్‌సభ పక్షనేత సుష్మాస్వరాజ్‌ను కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రాంతాలు ఇక కలిసుండే పరిస్థితులు లేవని కోదండరామ్‌ స్పష్టం చేశారు. మానసికంగా, భౌతికంగా ఏనాడో విడిపోయారని అన్నారు. ఇవాళ ఆయన బీజేపీ నేత సుష్మాస్వరాజ్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు మద్ధతివ్వాలని తాము సుష్మాను కోరామని అందుకు ఆమె తెలంగాణ ఏర్పడి తీరుతుందని హామీ ఇచ్చారని వివరించారు. విభజన అనివార్యమని, ఇక కలిసుండే పరిస్థితులు ఏపీలో లేవని పేర్కొన్నారు. ఇప్పుడు కాదంటే హింసకూడా ప్రజ్వరిల్లే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ రాకపోతే చట్టసభలపై ప్రజలకు విశ్వాసం పోతుందని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ కూడా విరుద్ధ భావాలు కలిగిన రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధ్యంకాదని తెలిపారు. ఒకమెట్టు దిగైనా సరే రెండుపార్టీలు సమస్య పరిష్కారానికి కషిచేయాలని విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర నేతలు హింసకు పాల్పడి బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నారని కోదండరాం ఆరోపించారు. ఇదిలావుంటే తెలంగాణపై తమ వైఖరి మారలేదని బీజేపీ పునరుద్ఘాటించింది. ఈమేరకు ఆపార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై తమ స్టాండ్‌ మారలేదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కమల్‌నాథ్‌ తెలంగాణపై బీజేపీ వైఖరి మారిందని నిందలు వేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. అసలు బీజేపీ లేకుండా పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును పాస్‌ చేయించగలరా? అని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లుపై ఎవరికీ ఆందోళన అవసరం లేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో బిజెపి వైఖరిలో మార్పు లేదని పార్టీ అగ్రనేతలు చెప్పారని తెలిపారు. రాష్టాన్రికి ఉన్న మంచిపేరును మన ఎంపీలు భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకునేలా మన ఎంపీలు ప్రవర్తించారని అన్నారు. లోక్‌సభలో అల్లరి చేసిన వారిని సభ నుంచి బహిష్కరించాలని.. భవిష్యత్‌లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణపై పార్టీ నాయకత్వం వైఖరిలో మార్పు లేదని పునరుద్ఘాటించారు. సీమాంధ్ర ప్రాంత సమస్యలు కూడా పరిష్కరించాలని మా నాయకత్వం కోరుతోందని తెలిపారు. మా పార్టీ యూ టర్న్‌ తీసుకుందని కేంద్ర మంత్రి కమల్‌నాథ్‌ అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. అనవసరంగా బీజేపీని బ్లేమ్‌ చేయ్యొద్దని విజ్ఞప్తి చేశారు. కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు కూడా బీజేపీ స్టాండ్‌ మారిందని అభాండాలు వేస్తున్నారని అలాంటి వ్యాఖ్యలను మానుకోవాలని కోరారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడితే మద్ధతిస్తామని సుష్మా స్వరాజ్‌ హామీ ఇచ్చారని కిషన్‌రెడ్డి వివరించారు. తెలంగాణ బిల్లుపై ఆందోళన అవసరంలేదని సుష్మా అన్నారని వివరించారు. అందరూ సంయమనంతో ఉండాలని చెప్పారన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల పోరాట ఫలితమే నేటి తెలంగాణ బిల్లు అని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వస్తేనే హైదరాబాద్‌ వస్తా, లేకుంటే రాను అని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. తాను తెలంగాణ కోసమే బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. నూటికినూరు పాళ్లు తెలంగాణ వస్తుందని నాగం ధీమా వ్యక్తం చేశారు.