భాజపాకు సీమాంధ్ర చీడ
బాబు, వెంకయ్య మంతనాలతో బిల్లుకు పీడ
కాంగ్రెస్ బహిష్కృతులను చేర్చుకుని
తనతో పొత్తుపెట్టుకుంటే బలపడతామని బాబు భరోసా
తలపట్టుకుంటున్న తెలంగాణ భాజపా తమ్ముళ్లు
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఫిబ్రవరి 14 (జనంసాక్షి) :
భారతీయ జనతా పార్టీని సీమాంధ్ర చీడ పట్టింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటే ఏదేదో చేస్తామని ఆ పార్టీ అధినాయకత్వాన్ని ఆ పీడ తొలిచేస్తుంది. తెలంగాణను అడ్డుకోవడమే పరమావధిగా ముందుకు సాగుతోన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు, అదే ప్రాంతానికి చెందిన బీజేపీ సీనియర్ నేత వెంకయ్య జతగూడటంతో కుట్ర రాజకీయాలు ముదిరిపాకాన పడ్డాయి. తెలంగాణను వ్యతిరేకిస్తూ సొంత పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం పెట్టి కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలను తమ పార్టీలో చేర్చుకోవాలనే ఉబలాటంలో బీజేపీ తెలంగాణపై పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలతో తప్పటగుడులు వేస్తోంది. మరోవైపు తెలంగాణను ఆపితే ఆ క్రెడిట్‌ను సొంతం చేసుకోవడం ద్వారా సీమాంధ్రలో అత్యధిక ఎంపీ స్థానాలను గెలిచి ఇస్తామన్న చంద్రబాబు ఆఫర్, దానికి వెంకయ్య మాంత్రంగం వెరసి తెలంగాణ ప్రాంత భాజపా నాయకులు తలెత్తుకోలేకుండా చేస్తోంది. మొత్తానికి బీజేపీలో టీడీపీ చిచ్చుపెట్టింది. సీమాంధ్ర చీడ ఆ పార్టీ అధినాయకత్వానికి వేళ్ల నుంచి చిగుళ్ల వరకు పట్టి ఏం చేస్తుందో కూడా అర్థం కాకుండా చేస్తోంది. ఇంతకాలం తెలంగాణకు అనుకూలమని, బిల్లు పెడితే బేషరతుగా మద్దతు ఇస్తామని ప్రకటిస్తూ వచ్చిన బీజేపీ స్వరంలో మార్పునకు కారణం చంద్రబాబేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు మితృత్వం వల్ల ఆ పార్టీలోని అగ్రనేతలే అభిప్రాయభేదాలతో సతమతమవుతున్నట్లు సమాచారం. లోక్‌సభలో కేంద్రం తెలంగాణబిల్లు ప్రవేశపెట్టిన అనంతరం పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేతలు పరస్పర విభిన్న ప్రకటనలు చేశారు. లోక్‌సభలో బిల్లు పెట్టలేదని ప్రతిపక్ష నాయకురాలు సుష్మస్వరాజ్ వివాదాస్పదమైంది. లోక్‌సభ వెబ్‌సైట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినట్లు లోక్‌సభ సచివాలయం ప్రకటన చేసింది. బిల్లు పెట్టే సమయంలో సభలోనే ఉన్న సుష్మస్వరాజ్‌కు హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలంగాణ బిల్లును ప్రతిపాదించగా.. స్పీకర్ మీరాకుమార్ దాన్ని చర్చకు ఆమోదిస్తున్నట్లు ప్రకటించడం.. టీవీల ద్వారా ప్రపంచానికి తెలిసినా ఆమె మాత్రం తెలియదంటూ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తోందని, ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలను కంట్రోల్ చేయలేకపోతోందని ఆమె కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. అయితే, భవిష్యత్‌లో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ బిల్లుపై ప్రభుత్వంతో ఏ రూపంలోనూ చర్చింబోమంటూ ఆమె స్పష్టం చేశారు. తెలంగాణకు తాము అనుకూలమైనా సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలను కాపాడలనేదే తమ లక్ష్యమన్నారు. మరోఅగ్రనేత ఎల్‌కే అద్వానీ సైతం ఆమె వాదనతో ఏకీభవించారు. 1972 నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నానని, ఇంతకు ముందెన్నడూ ఇటువంటి ఘటనను చూడలేదని వ్యాఖ్యానిస్తూనే ఓటాన్ అకౌంట్ తప్ప మరే బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం లేదని ప్రధాన ప్రతిపక్షంగా తాము అంగీకరించబోమని ప్రకటించారు. బిలు ప్రవేశపెడుతున్నట్లు తాము ముందస్తు సమాచారం ఇవ్వలేదని, బిల్లుకు ముందు సభ్యులకు ఇచ్చే పత్రాలను కూడా తమకు అందించలేదని, తమ సలహాలు పాటించడం లేదని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఇదిలాఉండగా, ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ వీరి ప్రకటనల విరుద్దంగా పార్టీ విధానాన్ని పునరుద్ఘాటించారు. పార్టీ అధ్యక్షుడిగా చెబుతున్నా.. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని, తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని, ఈ విషయంలో కాంగ్రెస్ తమపై అసత్య ప్రచారం చేస్తుందని ప్రకటించారు. దీంతో ఆ పార్టీ నాయకుల మధ్య విభజన వచ్చేందుకు చంద్రబాబే కారణమని భావిస్తున్నారు. శుక్రవారం చంద్రబాబు నాయుడు బీజేపీ అధ్యక్షుడు అపాయింట్‌మెంట్ కోరినా ఆయన కలిసేందుకు ఇష్టపడలేదు. పార్టీలో అంతర్గతంగా నెలకొన్న పరిస్థితి బాబే కారణమని రాజ్‌నాథ్‌సింగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీతో పొత్తు ఆలోచన వచ్చినప్పటి నుండే పార్టీ నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కువయ్యాయన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో కలిగిస్తోంది. శుక్రవారం తెలంగాణ బీజేపీ నేతలు రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. ఈ సందర్భంలో కూడా భవిష్యత్ ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు వద్దని మొరపెట్టుకున్నట్లు సమాచారం. ఒంటరిగా పోటీచేస్తే తెలంగాణలో కొన్ని సీట్లను గెలుచుకోవడమే కాకుండా ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచుకునే అవకాశం ఉంటుందని, భవిష్యత్‌లో పార్టీ అభివృద్ధికి దోహదం చేస్తుందని, అలాకాకుండా బాబుతో పొత్తు కుదిరితే పార్టీ దెబ్బతింటుందని వారు రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పొత్తు విషయంలో రాజ్‌నాథ్‌సింగ్ సైతం పునరాలోచనడలో పడినట్లు తెలిసింది. ఏదేమైనా బీజేపీలో నెలకొన్న సంక్షోభానికి చంద్రబాబే కారణమన్న వాదనలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి.