-->

నేడు తెలంగాణపై చర్చ


ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ముగియగానే..

భాజపా ఎలా ఉన్నా బిల్లు నెగ్గించుకోవాలని కాంగ్రెస్‌ వ్యూహం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) :

తెలంగాణ బిల్లుపై సోమవారం లోక్‌సభలో చర్చ ప్రారంభించనున్నారు. గురువారం తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో మొదట ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే బిల్లుపై చర్చను ప్రారంభించనున్నారు. లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న 34 పార్టీలకు ప్రాధాన్యత క్రమంలో బిల్లుపై చర్చలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఈమేరకు స్పీకర్‌ కార్యాలయం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం 17న లోక్‌సభలో ఓటాన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి టీ బిల్లుపై చర్చను 18 లేదా 19 తేదీల్లో చేపట్టనున్నట్లు నిర్ణయించారు. అయితే బిల్లుపై చర్చ తప్పనిసరి అన్న ప్రధాన ప్రతిపక్షం డిమాండ్‌తో ముందస్తుగానే బిల్లుపై చర్చించి ఓటింగ్‌ పూర్తయితే రాజ్యసభకు పంపించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.  పార్లమెంట్‌ సమావేశాలు ఈనెల 21తో ముగియనుండటంతో మూడు రోజుల్లో రెండు సభల్లో బిల్లును ఆమోదించేలా వ్యూహ రచన చేశారు. ఈ పార్లమెంట్‌లో ఇవే చివరి సమావేశాలు కావడం, ఈ నెల 25, 26 తేదీల్లో ఎన్నికల నోటిపికేషన్‌ రానుండటంతో టీ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్చ ముగించేందుకే సిద్ధమైంది. తెలంగాణ బిల్లుపై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇబ్బంది తలెత్తకుండా పార్లమెంట్‌లో పాసయ్యేందుకు కేంద్రం, కాంగ్రెస్‌ తుది కసరత్తు చేస్తోంది. ఈమేరకు తెలంగాణ బిల్లుకు మద్దతిస్తామన్న పార్టీలతో సంప్రదింపులు జరుపుతోంది. తెలంగాణకు మొదటి నుంచి వ్యతిరేకమని చెప్తోన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంను కాంగ్రెస్‌ ఇప్పటికే ఒప్పించింది. అలాగే మరికొన్ని పార్టీల మద్దతుతో బీజేపీకి షాక్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ నిశ్చయించింది. మరోవైపు బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లు వద్దేవద్దన్నాడు. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌తో సమావేశాలు సరిపెడితే మంచిదని పార్టీ ముఖ్యుల భేటీలో పేర్కొన్నాడు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్‌ విఫలమైంది అని అద్వానీ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఎన్డీఎ హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేశామని, అందరితో చర్చించిన తరువాత బిజెపి ముందడుగేసిందని ఒకమారు గుర్తు చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. గత వారం లోక్‌సభలో జరిగిన ఘటనలు పార్లమెంటు స్థాయిని దిగజార్చింది. గురువారం ఎంపి లగడపాటి రాజగోపాల్‌ తన చేతిలోని పెప్పర్‌తో అలజడి సృష్టించడంతో తమ పార్టీ నేత సుష్మాస్వరాజ్‌ కంటి వెంట కన్నీళ్లొచ్చాయి. తన 44 ఏళ్ల పార్లమెంటు చరిత్రలో అటువంటి ఘటనలు తానెన్నడూ చూడలేదని అన్నారు. తెలంగాణ అంశం వల్లే పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సోనియా, మన్మోహన్‌సింగ్‌ వల్లే పార్లమెంటుపై గౌరవం దిగజారింది. కేంద్ర మంత్రులు కూడా స్పీకర్‌ వెల్‌లోకి రావడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బిల్లుకు మద్దతుపై అద్వానీని ఒప్పించేందుకు పార్టీ లోక్‌సభ, రాజ్యసభ పక్షనేతలు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ తుది వరకూ ప్రయత్నించారు. బీజేపీ దారికొస్తే సరేసరి. లేకుంటే మూజువాణితోనైనా గట్టెక్కించాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండటంతో అనవసర రద్దాంతానికి పోతే పరువు పోతుందనే ధోరణిలో బీజేపీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బిల్లును రాజ్యసభలో ఆమోదింపజేసుకునేందుకు సంఖ్యాబలం సిద్ధం చేసుకుంది. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245కాగా, ఇందులో కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య 72. తమకు మద్దతుగా నిలిచే పార్టీల బలంతో సునాయసంగా గట్టెక్కవచ్చని కాంగ్రెస్‌ భావిస్తోంది. ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే బీఎస్పీకి 15, జేడీయూకి9, డీఎంకేకు6, ఎన్సీపీకి6, సీపీఐకి 2, ఆర్జేడీకి2 మంది చొప్పున సభ్యులున్నారు. వారికి తోడు ఇతరులు 8మంది ఉన్నారు. చిన్నాచితక పార్టీలకున్న 10మంది సభ్యుల మద్దతుతో తెలంగాణ బిల్లును సునాయసంగా ఆమోదింపజేసుకోవచ్చని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది. అయితే బీజేపీ మద్దతు కూడా లభిస్తే అత్యధిక మెజార్జీతో ఆమోదింపజేసుకోగలుగుతామని అంటున్నారు. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తున్న  పార్టీలు మొత్తం 54మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. సీసీఎం11, టీఎంసీ9, ఎస్పీ9, అన్నాడీఎంకే 7, బీజేడీ6, టీడీపీ 4, శిరోమణి అకాళిదళ్‌ 3, శివసేన4 కలుపుకుంటే తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తున్న సభ్యుల బలం 54మాత్రమే అవుతోంది. ఈ లెక్కన ఓటింగ్‌ జరిగినా బిల్లు సునాయసంగా గట్టెక్కవచ్చని భావిస్తున్నారు.