నేడు సభలో టీ బిల్లుపై చర్చ


బీఏసీలో తెలంగాణ అంశం
చర్చలో పాల్గొననున్న సోనియా
విప్‌ జారీ చేశాం : కమల్‌నాథ్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు (ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదా-2014) బిల్లుపై మంగళవారం లోక్‌సభలో చర్చించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ తెలిపారు. మంగళవారం లోక్‌సభ వ్యవహారాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ బిల్లును చేరుస్తూ లోక్‌సభ కార్యాలయం సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణ బిల్లు అనంతరం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఆమోదంపై సభలో చర్చించనున్నట్లు లోక్‌సభ కార్యాలయం షెడ్యూల్‌లో పేర్కొంది. లోక్‌సభలో చర్చ పూర్తయిన తర్వాత మరుసటి రోజే రాజ్యసభలో బిల్లు ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయి. రాజ్యసభలో బిల్లుపై చర్చించడానికి 2 గంటల సమయం కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. లోక్‌సభలో మంగళవారం తెలంగాణ బిల్లుపై చర్చ జరుగుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌ నాథ్‌ తెలిపారు. 19 లేదా 20 తేదీల్లో రాజ్యసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభలో తెలంగాణ బిల్లుపై చర్చకు చైర్మన్‌ అన్సారీ రెండు గంటల సమయం కేటాయించారు. సస్పెన్షన్‌కు గురైన సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యులు, సభలో సీమాంధ్ర కేంద్రమంత్రులు వ్యవహారంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ సోమవారం స్పందించారు. సస్పెన్షన్‌కు గురైన ఎంపీల వ్యవహారంపై స్పీకర్‌ మీరాకుమార్‌ నిర్ణయం తీసుకుంటారని కమల్‌ చెప్పారు. కేంద్రమంత్రులు సభకు ఆటంగం కలిగించరని తాను భావిస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేయవచ్చునన్నారు. ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేసే చర్య తన పరిధిలో లేదన్నారు. రేపే తెలంగాణ బిల్లు పైన చర్చ ఉంటుందని కమల్‌నాథ్‌ చెప్పారు. ఇదిలావుంటే విభజన బిల్లు ఈనెల 19, 20వ తేదీల్లో రాజ్యసభకు బిల్లు వస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు పేర్కొన్నారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్‌సభలో బిల్లుపై చర్చ పూర్తయిన తరువాత రాజ్యసభకు బిల్లు వస్తుందని, ఈ విషయం రాజ్యసభ చైర్మన్‌ చెప్పారని తెలిపారు. మొదట అందరూ ఒప్పుకున్న వారేనని, కావున అందరూ సహకరించాలని కోరారు. మంత్రుల చర్యలను ఆయన తప్పుబట్టారు. మంత్రులను అలా చేయవద్దని ప్రజలు ఏమి అనుకుంటున్నారో ఆలోచించుకోవాలని వీహెచ్‌ సూచించారు. మంగళవారమే యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ తెలంగాణ బిల్లుపై చర్చలో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్‌ వంద శాతం ఆమోదిస్తుందని కమల్‌నాథ్‌ తెలిపారు. బిల్లును ఎవరైనా వ్యతిరేకించాలనుకుంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాలను అనుసరించాలే తప్ప ఎలాంటి ఆందోళనలతో ప్రయోజనం ఉండబోదని అన్నారు. ఈ సందర్భంగా కమల్‌నాథ్‌తో సీమాంధ్ర మంత్రులు వాగ్వాదానికి దిగారు. తెలంగాణ బిల్లుకు మద్దతివ్వాలని సోమవారం పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో సోనియాగాంధీ బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడును కోరారు. అయితే తాము ప్రతిపాదించిన సవరణలను ఆమోదిస్తే తెలంగాణ బిల్లుకు మద్దతునిస్తామని వెంకయ్య అన్నారు. ఆ సవరణలు ఏమిటో తమకు తెలుపాలని సోనియాగాంధీ కోరారు. అలాగే తెలంగాణ బిల్లులో సవరణలపై చర్చించేందుకు బీజేపీ అగ్రనాయకులు ఎల్‌కే అద్వానీ, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీతో కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్‌షిండే, జైరాం రమేశ్‌ సమావేశమయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్‌ సమావేశాలు ముగిసేలోగా సభ ఆమోదం పొందేలా కాంగ్రెస్‌ పార్టీ, కేంద్రం ప్రయత్నాలు సాగించి పలు పార్టీల మద్దతు కూడగట్టాయి.