జయహో తెలంగాణ

లోక్‌ సభలో ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్ధీకరణ బిల్లు ఆమోదం

ఫలించిన తెలంగాణ ప్రజల 60 ఏండ్ల  నిరీక్షణ

లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం

తెలంగాణలో అంబరాన్నంటిన  సంబురాలు

హైదరాబాద్‌ : ఎండి బీటలు వారిపోయిన కోట్లాది తెలంగాణ ప్రజల హృదయాల్లో ఆత్మీయ జలాలు వర్షించినట్లుగా దు:ఖంతో తాడారిపోయిన కళ్లల్లో ఆనంద బాష్పాలు జలజలా దుమికినట్లు ఎదురుచూసే మస్తిష్కాలు ఉద్వేగంతో ఉప్పొంగిపోయినట్లు శరిరాలు కాల్చుకుని ఆత్మబలిదానం చేసుకుని ధిక్కారనినాదాలిచ్చిన తెలంగాణ బిడ్డల స్వేచ్చా పతాకాలను ఎగురవేసినట్లు ఉరితాళ్లు పేనుకుని మృత్యువును అలుముకున్న బిడ్డలు శాంతించి ఆనంద పరవంతో ఉప్పొంగి రెక్కలు విప్పుకుని స్వేచ్చా లోకంలో విహరిస్తున్నట్లు తెలంగాణ జీవిత కాలంలో ఒక విజయం సాధించినట్లు లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం లభించింది. 60 సంవత్సరాలుగా స్వేచ్చాస్వతంత్య్రాల కోసం పిడికిలెత్తిన తెలంగాణ ప్రజల కల సాకరమైన రోజు. విద్యార్ధి నాయకుల బలిదానాల సాక్షిగా తెలంగాణ రాష్ట్రం సిధ్దించిన రోజు.  లోక్‌సభలో రాష్ట్ర పునర్‌వ్యవస్ధీకరణ బిల్లుకి లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు భారతీయ జనతాపార్టీ మద్దతు తెలపడంతో వెంటనే స్పందించిన స్పీకర్‌ వరసగా బిల్లులోని సవరణలపై ఓటింగ్‌ తర్వాత సభ మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు. ఈబిల్లు ఆమోదంలో కేంద్ర హోంమంత్రి షిండే, విపక్ష నేత సుష్మస్వరాజ్‌ ,మంత్రి జైపాల్‌రెడ్డి మాత్రమే  ప్రసంగించారు. లోక్‌సభలో బిల్లు ఆమోదంకాగానే తెలంగాణ ప్రజల సంబరాలు మిన్నంటాయి. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం తెలంగాణ భవన్‌లో పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు,తెలంగాణ వాదులు స్వీట్లు పంచుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.