నేడు రాజ్యసభలో తెలంగాణ చర్చ


విప్‌ జారీ చేసిన కాంగ్రెస్‌
ఎలాగైనా నేడు గట్టెక్కించాలని కృతనిశ్చయం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై పెద్దల సభలో గురువారం చర్చ జరుగనుంది. ఈ విషయాన్ని రాజ్యసభ డెప్యూటీ చైర్మన్‌ కురియన్‌ తెలిపారు. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు రాజ్యసభ పున: ప్రారంభమైన తర్వాత కూడా సభా నిర్వహణకు అనుకూల వాతావరణం లేకపోవడంతో ఆయన సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఆంధ్రప్రదేశ్‌ను ఎలా విభజిస్తున్నారంటూ డెప్యూటీ చైర్మన్‌ను ప్రకటించగా ఆయన దానిపై సభలో రేపు చర్చిద్దామని తెలిపారు. రాజ్యసభలో బిల్లుకు తాము ప్రతిపాదించిన సవరణలకు ఓకే చెప్తేనే మద్దతిస్తామంటూ బుధవారం బీజేపీ అడ్డం తిరగడంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లును ఎలాగైనా సభామోదం పొందేలా చూడాలని చర్యలు తీసుకుంటోంది. అయితే బీజేపీ మద్దతు లేకుండానే రాజ్యసభలో బిల్లు నెగ్గే అవకాశమున్నా అలాచేస్తే ఆ పార్టీ నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి రెండు గంటలపాటు చర్చించి, సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సోనియాగాంధీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కోరారు. ఈ చర్యల ద్వారా బీజేపీని దారిలోకి తెచ్చుకోవాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. అలాగే గురువారం పార్టీ రాజ్యసభ సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలంటూ కాంగ్రెస్‌ పార్టీ విప్‌ జారీ చేసింది. తెలంగాణ బిల్లును ఎలాగైనా పెద్దల సభ ఆమోదించేలా చర్యలు చేపట్టింది. బీజేపీ కలిసి వచ్చినా రాకున్నా రాజ్యసభలో బిల్లును పాస్‌ చేయించి గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. బిల్లుకు షరతులు లేకుండా బీజేపీ మద్దతిచ్చేందుకు ఆ పార్టీ ముఖ్యనేతలతో ప్రభుత్వ పెద్దలు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. గురువారం నాటి రాజ్యసభ ఎజెండాలో తెలంగాణను చేర్చడం ద్వారా సమావేశాలు ముగియడానికి ఒక రోజు ముందే తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్రం వ్యూహ రచన చేసింది. మరోవైపు పెద్దల సభలో బిల్లు ఆమోదింపజేసి తీరుతామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కేసీఆర్‌కు హామీ ఇచ్చినట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. బుధవారమే బిల్లు సభ ఆమోదం పొందుతుందని ఆశించిన కేసీఆర్‌ గ్యాలరీలో కూర్చొని సభా కార్యక్రమాలను వీక్షించారు. అయితే బిల్లు సభ ముందుకు రాకపోవడంపై ఆయన ప్రధాని వద్ద అసహనం వ్యక్తం చేయగా గురువారం రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందుతుందని స్పష్టమైన హామీ ఇచ్చారు.