తెలంగాణ బిల్లు పాస్‌

తెలంగాణకు పెద్దల సభ జై

టీ బిల్లుకు 148 మంది సభ్యుల మద్దతు

సవరణలపై మూజువాణి ఓటింగ్‌ నిర్వహించి డెప్యూటీ చైర్మన్‌

చివరి వరకూ వెంకయ్య కొర్రీలు

డివిజన్‌కు పట్టుబట్టిన సీమాంధ్ర నేత

రెండు రాష్ట్రాలకు రెండు హైకోర్టులు

ఐదేళ్ల పాటు సీమాంధ్రకు ప్రత్యేక రాయితీలు

పోలవరం పూర్తి చేస్తాం : ప్రధాని

మొదటి ఏడాది సీమాంధ్ర లోటు బడ్జెట్‌ను కేంద్రమే భరిస్తుంది

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20 (జనంసాక్షి) : కుట్రలు బద్దలయ్యాయి. కొర్రీలు కొరగాకుండా పోయాయి. లోక్‌సభ ఆమోదం పొందిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు పెద్దల సభలో అఖండ విజయం సాధించింది. తెలంగాణకు బీజేపీ మద్దతిస్తున్నట్లు ప్రకటించినా సీమాంధ్రకు చెందిన సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు అడుగడుగునా కొర్రీలు పెట్టాడు. బిల్లుకు సవరణ పేరుతో సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. ఒకానొక దశలో డివిజన్‌ కావాలంటూ రాజ్యసభ డెప్యూటీ చైర్మన్‌ను కురియన్‌ను పట్టుబట్టారు. రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ప్రవేశపెట్టిన బిల్లుకు 148 మంది సభ్యులు మద్దతు పలికారు. ఆరు దశాబ్దాల ఆకాంక్ష.. నాలుగున్నర దశాబ్దాల పోరాటం.. నాలుగు కోట్ల గొంతుకల నినాదం తెలంగాణ రాష్ట్రం సాకారం అయింది. ఇక రాష్ట్రపతి రాజముద్రే తరువాయి. తెలంగాణ భారత దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించబోతోంది. ఇక మనం స్వేచ్ఛా జీవులం. ఇక మనమే పాలకులం. తెలంగాణ బిల్లును రాజ్యసభలో అడ్డుకునేందుకు సీమాంధ్ర పెట్టుబడిదారి శక్తులు తమ కుట్రలను కొనసాగించాయి. సభా కార్యక్రమాలు కొనసాగకుండా అడుగడుగునా అడ్డుతగిలారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ బిల్లుపై మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రెండు రాష్ట్రాలకు రెండు వేర్వేరు హైకోర్టులను ఏర్పాటు చేస్తామని, కొత్తగా ఏర్పాటు కాబోయే అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల పాటు పన్ను రాయితీలిస్తామని చెప్పారు. పదేళ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వరంగ విద్యా, వైద్య, పారిశ్రామిక సంస్థల ఏర్పాటుకు నిపుణుల కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. అలాగే సీమాంధ్ర ప్రాంతం ఎదుర్కొనే మొదటి ఏడాది లోటు బడ్జెట్‌ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.