టెన్‌ జన్‌పథ్‌కు నేతల క్యూ


తెలంగాణ ఇచ్చినందుకు వందనాలు
సహజీవనం సాగించండి : సోనియా
రెండు రాష్ట్రాల ప్రజలం కలిసిమెలిసి జీవిస్తాం : కోదండరామ్‌
రాష్ట్రపతి పాలన వద్దు : దామోదర రాజనర్సింహ
మేడమ్‌ మాట నిలబెట్టుకున్నారు : డీఎస్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చిన ఏఐసీసీ అధినేత్రి, యూపీఏ చైర్‌ పర్సన్‌ను కలిసేందుకు తెలంగాణ నేతలు ఆమె నివాసం టెన్‌ జన్‌పథ్‌కు క్యూ కట్టారు. ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు విజయం సాధించడం కోసం ఆమె చేసిన కృషి ఈ సందర్భంగా కొనియాడారు. తెలంగాణ ప్రజల పక్షాన ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం పార్లమెంట్‌ సమావేశాలు ముగియనుండగా ఉదయం, సాయంత్రం సోనియాగాంధీని కలిసేందుకు తెలంగాణ నేతలు పెద్ద సంఖ్యలో ఆమె నివాసానికి తరలివచ్చారు. అందరితో ఆప్యాయంగా మాట్లాడిన సోనియాగాంధీ సోదరుల్లా సహజీవనం సాగించాలంటూ సూచించారు. తనకు తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు సమానమేనని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చామని అన్నారు. ఇదే సమయంలో సీమాంధ్ర ప్రజల మనసులు కొద్దిగా గాయపడి ఉంటే ఉండవచ్చు కాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆ ప్రాంతం స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సీమాంధ్ర ప్రజలతో మరింత సోదరభావంతో మెలగాలని తెలంగాణ ఐకాస నేతలను సోనియా కోరారు. సీమాంధ్ర ప్రజల్లో అసంతృప్తి ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. తనకు సీమాంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాలు సమానమేనని సోనియాగాంధీ స్పష్టం చేశారని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. ఈమేరకు వాళ్లు సోనియాను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల ప్రజలం కలిసి మెలిసి జీవిస్తామని తాము సోనియాగాంధీకి భరోసా ఇచ్చినట్లు టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ప్రజల మధ్య లేని విద్వేషాలను సృష్టించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తమ పోరాటమంతా సీమాంధ్ర వలస పాలకులకు, దోపిడీదారులకు మాత్రమే వ్యతిరేకమని, సీమాంధ్ర ప్రజలకు ఎంతమాత్రం కాదని ఆయన పునరుద్ఘాటించారు. విభజన వల్ల సీమాంధ్రుల మనసులు కొంత గాయపడినట్టున్నాయని కాబట్టి వారిని కలుపుకుని వెళ్లాల్సిన బాధ్యత తమదేనని సోనియా సూచించినట్టు వెల్లడించారు. సోనియాను కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యావాదాలు తెలిపారు. త్వరలోనే కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో భారీ బహిరంగ నిర్వహించనున్నట్టు నేతలు తెలిపారు. సోనియాను రాష్ట్రానికి రావాల్సిందిగా కోరామని, అందుకు ఆమె అంగీకరించారని నేతలు తెలిపారు. ఎన్నికల నోటిఫికేస్‌ వెలువడేకంటే ముందే ఈ ర్యాలీ ఉండే అవకాశం ఉందన్నారు.
కాంగ్రెస్‌ పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితి విలీనమయ్యే సమయం ఆసన్నమైందని మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ తెలిపారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమం జరుగుతందన్న విశ్వాసం ఉందన్నారు. అయితే ఈ వ్యవహారన్ని కాంగ్రెస్‌ పెద్దలు చూసుకుంటారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీర్చారని అన్నారు. తెలంగాణ ప్రజలు ఆమెకు జన్మజన్మలకు రుణపడి ఉంటారన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ విలీనంపై అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా అది త్వరలోనే జరుగుతందని చెప్పారు. ఇందుకు సంబంధించిన పక్రియను అధిష్టానం చూస్తుందన్నారు. మేడమ్‌ సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. సీఎం కిరణ్‌ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. సీఎం రేసులో తాను మాత్రం లేనని స్పష్టం చేశారు. సాధారణ ఎన్నికల ముందే రెండు రాష్ట్రాలు ఏర్పడతాయని డి.శ్రీనివాస్‌ వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు. డి. శ్రీనివాస్‌, గీతారెడ్డి, ఆమోస్‌ ఉన్నారు. ఈ సందర్భంగా డీఎస్‌ సోనియాతో పది నిమిషాలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. తెలంగాణ కల సాకారం అవటంతో హస్తినలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు హడావుడి చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌తో తెలంగాణ ప్రాంత నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వద్దని విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా తెలంగాణ కాంగ్రెస్‌ నేతల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సోనియా గాంధీని ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక శుక్రవారం సమావేశమైన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీలో కూడా ఆంధప్రదేశ్‌ వ్యవహారాలపైనే చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే టీఆర్‌ఎస్‌ విలీనంపైనా చర్చ సాగినట్లు సమాచారం.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి మెజార్టీ ఉందని ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశమే లేదని డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఎలా వచ్చారో అలాగే వెళ్లిపోయారని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీయే సుప్రీం తప్ప వ్యక్తులు కాదని, కిరణ్‌కుమార్‌రెడ్డికి అధిష్టానం ప్రాధాన్యం ఇస్తే ఆయన దాన్ని నిలుపుకోలేదని అన్నారు. ఎవరి దయ వల్ల వైఎస్‌ కుటుంబం ఈ స్థాయికి వచ్చింది జగన్‌ గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాము, టీఆర్‌ఎస్‌ కలిసి పనిచేశామని ఇప్పుడు అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు.