తెలంగాణతో తిరిగొచ్చిన కోదండరామ్ సార్
ఎయిర్‌పోర్టులో భారీ స్వాగతం
గన్‌పార్క్ వద్ద అమరులకు ఘనంగా నివాళి
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే తన ఆశ, శ్వాస అయి ఉద్యమాన్ని ముందుండి నడిపించిన తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ తెలంగాణ రాష్ట్రంతోనే నగరానికి తిరిగొచ్చారు. శనివారం న్యూఢిల్లీ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న కోదండరామ్ బృందానికి తెలంగాణవాదులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా గన్‌పార్క్‌కు చేరుకున్న కోదండరామ్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి, యెన్నెం శ్రీనివాస రెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులు శ్రీనివాస్ గౌడ్, దేవీప్రసాద్, విఠల్ తదితరులు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న వారికి తెలంగాణవాదులు, అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలతో శంషాబాద్ నుంచి ఊరేగింపుగా గన్‌పార్క్ వద్దకు చేరుకుని తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం కోదండరామ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చిరకాల కల నెరవేరిందని అన్నారు. ఇది తెలంగాణ ప్రజల విజయమని, అమరవీరుల త్యాగఫలమని వారు అన్నారు. దీనిని అమరవీరులకు అంకితం ఇస్తున్నామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా జేఏసీ ముందుంటుందని కోదండరామ్ అన్నారు. తెలంగాణ సాధనకోసం నాలుగున్నర దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు ప్రజాస్వామబద్ద పోరాటాలు సాగించారని, ఎన్నో త్యాగాలు చేశారని అన్నారు. తెలంగాణ సాధనే ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని, ఎలాంటి ప్రత్యామ్నాయాలను అంగీకరించబోమని తాము కేంద్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పామని అన్నారు. ప్రజల ఆకాంక్షను కేంద్రం గౌరవించిందని, పలు జాతీయ పార్టీలు పార్లమెంట్‌లో మద్దతు పలికాయని, వారందరికీ ప్రజల పక్షాన కృతజ్ఞతలు చెప్పామన్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ చేరుకున్న భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డికి పార్టీ కార్యకర్తలు, తెలంగాణవాదులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసమే తాను బిజెపిలో చేరానని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుతో ఇక్కడి ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారని అన్నారు.తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో మద్దతు తెలిపి రాష్ట్ర సాధనకు కృషి చేసిన తమ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, లోక్‌సభ ప్రతిపక్షనేత సుష్మా స్వరాజ్‌లకు ధన్యవాదాలు తెలుపుతున్నాని చెప్పారు. తెలంగాణ ఏర్పడే వరకు రానని చెప్పిన తాను మాటకు కట్టుబడి వచ్చానన్నారు. మరో ఎమ్మెల్యే ఎన్నం మాట్లాడుతూ తనను ఎన్నుకున్న పాలమూరు ప్రజల రుణం తీర్చుకున్నానని అన్నారు. ఇక పాలమూరు ప్రజలకు అభివృద్ది ఫలాలు అందేలా కృషి చేస్తానన్నారు. పాలమూరు వెనకబాటు తనంపై పోరాడుతానన్నారు. బిజెపి నేతలు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసినందుకు వారికి కృతజ్ఞతుల తెలిపారు.కాగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖర్ రావు మాత్రం ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని విలీనం చేయడమా లేక ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడమా అనేదానిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ మంత్రులు కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. మరోవైపు మంత్రి బస్వరాజు సారయ్య కూడా శనివారం ఢిల్లీ పర్యటన ముగించుకుని సారయ్య హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కలను సాకారం చేసిన కేసీఆర్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లక్షమందితో ఘనస్వాగతం పలుకుతామన్నారు. తెలంగాణ సాధనలో ఆయన పోరాటం మరువలేనిదన్నారు.