తెలంగాణతో తిరిగొచ్చిన టీ కాంగ్రెస్ నేతలు
దారి పొడవునా నీరా’జనాలు’
కాంగ్రెస్‌ను గెలిపిద్దాం.. కృతజ్ఞత చాటుదాం : జానారెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంతోనే ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. పార్లమెంట్ ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం కోసం అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు వెళ్లిన ఈప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆదివారం ఢిల్లీ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి గన్‌పార్క్ వద్దకు అక్కడి నుంచి గాంధీభవన్‌కు భారీ ర్యాలీ నిర్వహించారు. దారిపొడవునా నేతలకు భారీ సంఖ్యలో ప్రజలు నిరాజనాలు పలికారు. గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. వారి త్యాగాలు చిరస్మరణీయమని, వారి స్ఫూర్తితోనే తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. అనంతరం గాంధీ భవన్‌లో నిర్వహించిన విజయోత్సవ సభలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. జానారెడ్డి మాట్లాడారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడంతో కొత్త రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో సుపరిపాలన అందిస్తాం. తెలంగాణలో అభివృద్ధికి హామీ ఇసామని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం.. సామాజిక న్యాయం చేకూరుస్తామని తెలిపారు. అమరుల త్యాగఫలమే తెలంగాణ అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి పనితీరును ప్రదర్శించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. కాంగ్రెస్‌ను గెలిపించి తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞత చాటుకుందామని అన్నారు. కార్యక్రమంలో మంత్రులు జె.గీతారెడ్డి, డి.కె. అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, శ్రీధర్‌బాబు, బస్వరాజు సారయ్య ఎంపీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
అంతకుముందు ఎంపీలు మీడియా సమావేశం నిర్వహించారు. సోనియా వల్లే 56 ఏళ్ల పోరాటం ఫలించిందని ఎంపీ రాజయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని కోరారు. మరో ఎంపీ మధుయాష్కీ మాట్లాడుతూ టీడీపీనీ ఎవరూ ఆదరించవద్దని తెలంగాణవాదులకు సూచించారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వారికి మాజీ మంత్రి దానం నాగేందర్, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ స్వాగతం పలికారు. ఎంపీలు మధుయాష్కీ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాజయ్య కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ తదితరులు నగరానికి వచ్చిన వారిలో ఉన్నారు. వారు మీడియాతో మాట్లాడారు. మధుయాష్కీ మాట్లాడుతూ చంద్రబాబు కుట్రలను గమనించాలని కోరారు. తెలంగాణ మద్దతు ఇస్తున్నామంటూనే దేశమంతా ఎందుకు కలియదిరిగారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. చంద్రబాబును ఎవరూ నమ్మడం లేదు. తెలంగాణ ఏర్పాటు విషయంలో ఎవరెన్ని కుట్రలకు పాల్పడ్డా.. సోనియాగాంధీ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని అన్నారు. కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ సోనియా లేకపోయినా.. దేశంలో ఆమె నాయకత్వం లేకపోయినా తెలంగాణ వచ్చేదే కాదని అన్నారు. విజయోత్సవ సభలు నిర్వహించేందుకు సిద్ధమయ్యామని, సీమాంధ్ర ప్రాంత ప్రజలు బాధపడతారేమోననే అనుమానాలు రావడంతో ఆ ఉత్సవాల నిర్వహణను ఉపసంహరించుకున్నామని వెల్లడించారు. సోనియానే తెలంగాణ తల్లి అని ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ అన్నారు. తెలంగాణ ప్రజలు ఆమెకు రుణపడి ఉన్నారని అన్నారు. ఆమె లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదని తెలిపారు. మరో ఎంపి గుత్తా సుకేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాంతాల వారీగానే విడిపోయామని, ఇరు ప్రాంతాలను అభివృద్ది చేసుకుని తెలుగుజాతి అంతా ఒక్కటేనని చాటుకుందామని సూచించారు. ఆనాడు ఇచ్చేది మేమే.. తెచ్చేది మేమే.. అన్నాం. ఇవాళ మేమే ఇచ్చాం.. మేమే తెచ్చాం.. అని వివరించారు. మరో ఎంపి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణాకు వ్యతిరేకంగా వ్యవహరించిన టీడీపీని తెలంగాణాలో బహిష్కరించాలని సూచించారు. సీమాంధ్ర టీడీపీ నేతలు తెలంగాణాకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తుంటే తెలంగాణ టీడీపీ నేతలు ఎక్కడికి పోయారని ధ్వజమెత్తారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టినప్పుడు తెలంగాణ టీడీపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడేమో తాము లేఖ ఇవ్వడం వల్లే కాంగ్రెస్ అధినేత్రి సోనియా తెలంగాణా ఇచ్చారని ప్రచారం చేస్తున్నారని, ఇదేమి సిద్ధాంతమో అర్ధం కావడం లేదని విమర్శించారు.
పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ విలేరులతో మాట్లాడుతూ, ఇచ్చిన మాటకు సోనియా ఒక్కరే చివరి వరకూ కట్టుబడి ఉన్నారని తెలిపారు. 60ఏళ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేశారు. సోనియాగాంధీ పట్టుదల వల్లే తెలంగాణ వచ్చింది. తన వాగ్దానాన్ని నెరవేర్చారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు చాలామంది కుట్రలు పన్నారన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సర్వశక్తులు ఒడ్డి పోరాడారు. తన అధికార, ధనబలంతోనే లేని సమైక్య ఉద్యమాన్ని ఉసిగొల్పాడు. కావాలని అక్కడి ప్రజలను రెచ్చగొట్టారు. చివరకు తానే నిష్క్రమించాడు. తెలంగాణ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందగానే సీమాంధ్రకు చెందిన కొందరు నేతలు తనకు అభినందనలు తెలియజేశారని, ఆ విషయాన్ని తానెప్పుడూ మరిచిపోనని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్రకు చెందిన సామాన్యులెవరూ వ్యతిరేకత తెలుపలేదని అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులంతా తెలంగాణా వారేనని స్పష్టం చేశారు. సీమాంధ్ర వ్యాపారవేత్తలు మాత్రమే తెలంగాణను వ్యతిరేకించారని, తెలంగాణ ఏర్పాటు కాకుండా అడ్డుకున్నారని దుయ్యబట్టారు.