ఢిల్లీలో కేసీఆర్‌ బిజీబిజీ


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 (జనంసాక్షి):
4ఢిల్లీలోనే మాకం వేసిన టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ రాజకీయవ్యూహంలో భాగంగా పావులు కదుపుతున్నారు. ఆదివారం కుటుంబ సమేతంగా సోనియాను కలసిని కెసిఆర్‌ సోమవారం కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రకటించినందుకు కృతజ్ఞతలు చెప్పడమే గాకుండా వివిధ అంశాలు, భవిస్యత్‌ కార్యాచరణపై క్లుప్తంగా చర్చించనట్లు సమాచారం. ఈ భేటీలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌ సింగ్‌ కూడా పాల్గొనడం విశేషం. తెలంగాణాలో అనుసరించబోయే వ్యూహంపై వీరి భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. దిగ్విజయ్‌తో టచ్‌లో ఉండమని సోనియా చెప్పిన 24 గంటల్లోనే ఈ భేటీ జరగడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్‌ తో పొత్తు, విలీనంపైనే ప్రధానంగా చర్చ జరిగిందని తెలుస్తోంది. మరోవైపు కేసీఆర్‌ మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్‌ను కలుసుకున్నారు. అంతకంటే ముందు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ రాష్ట్రపతిని కలుసుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో కేసీఆర్‌ భేటీ సందర్భంగా ఆయనకు ప్రణబ్‌ శుభాకాంక్షలు తెలిపారు. భేటీ అనంతరం కెసిఆర్‌ విూడియాతో మాట్లాడుతూ ఆయన తెలంగాణ ప్రజల తరఫున రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపానని పేర్కొన్నారు. తెలంగాణ రాష్టాన్రికి విూ ఆశీస్సులు ఉండాలని రాష్ట్రపతిని కోరామని తెలిపారు. అలుపెరగని పోరాటం చేసి అనుకున్నది సాధించావని రాష్ట్రపతి అభినందించారని పేర్కొన్నారు. తెలంగాణకు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ప్రణబ్‌ చెప్పారని తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలసిన వారిలో కేకే, వివేక్‌, మందాజగన్నాథం, ఇతర టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు. ఇదిలావుంటే రాష్ట్ర విభజన జరిగిపోవడంతో తన కార్యాచరణకు అనుగుణంగా క ఎసిఆర్‌ ముందు పెద్దల ఆశిస్సులు తీసుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తెలంగాణ సాధన కోసమే పార్టీని స్థాపించి 12 ఏళ్లపాటు ఉద్యమాన్ని నడిపించిన కేసీఆర్‌ కోరిక ఎట్టకేలకు నెరవేరింది. అయితే ఉద్యమపార్టీని ఇప్పుడు కేసీఆర్‌ ఏం చేయబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. అలాగే తెలంగాణ పునర్నిర్మాణలంలోనూ ఏం చేయబోతున్నారన్న ఉత్కంఠ సహజంగానే కలుగుతుంది. మరోవైపు పొలిటికల్‌ వ్యూహంలో భాగంగానే కేసీఆర్‌ కుటుంబసమేతంగా సోనియాగాంధీని కలిసినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు కృతజ్ఞతలు తెలిపేందుకే కలిసానన్న కేసీఆర్‌ భేటీ చివరలో కుటుంబసభ్యులను బయటకు పంపి సోనియాతో 10నిమిషాలసేపు ఏకాంతంగా మాట్లాడారు. విలీనం, పొత్తుపై కొద్ది రోజులుగా తర్జనభర్జనలు పడ్డ కేసీఆర్‌ ఇందుకు సంబంధించిన రెండు నివేదికలను సోనియాకు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో విలీనం కంటే పొత్తు వల్లే ఉభయ పార్టీలకు ఎక్కువ లాభం ఉంటుందని కేసీఆర్‌ మరోమారు కాంగ్రెస్‌ హైకమాండ్‌కు సూచించినట్లు తెలుస్తోంది. రాహుల్‌తో చర్చ సందర్భంగా ఇదే అంశంపై చర్చించినట్లు సమాచారం. గులాబీ బాస్‌ విలీన విన్యాసంలో పొత్తుల ఎత్తు తెరపైకి రావడంలో టీఆర్‌ఎస్‌ ఎన్నికల వ్యూహం కనపడుతోంది. టీఆర్‌ఎస్‌ విలీనమైతే కేసీఆర్‌పై ఒత్తిడి తగ్గి కాంగ్రెస్‌ అధిష్టానం పేరువిూద అంతా జరిగిపోతుంది. లేదంటే అసలు పొత్తుకే విలువ లేకుండా బహుముఖ పోటీలు తిరుగుబాట్లు పెరుగుతాయి. ఈ ఓట్ల చీలికలో బలమైన యంత్రాంగం గల టీడీపీ, విభజనకు సహకరించిన బిజెపి సీట్లు ఎక్కువ తెచ్చుకుంటాయనే భయం అటు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ను వెంటాడుతోంది. మరోవైపు విలీనం జరిగితే మొదట్లో ప్రాధాన్యతనిచ్చినా తర్వాత కేసీఆర్‌కు ఇంత బలమైన స్థానం ఉండబోదని కాంగ్రెస్‌ తేలిగ్గా చప్పరించేస్తుందని టీఆర్‌ఎస్‌ శ్రేణులు అనుమానపడుతున్నాయి. అందుకే విలీనంకంటే పొత్తుకే మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. కెసిఆర్‌ కూడా దీనికే ప్రాధాన్యం ఇస్తున్నారు. మరోవైపు ఇటు టీఆర్‌ఎస్‌ విలీనం విషయంలో కాంగ్రెస్‌ లోతుగా చర్చిస్తోంది. విలీనం, పొత్తు అంశాల్లో లాభనష్టాలను బేరీజు వేస్తోంది. టీఆర్‌ఎస్‌ని విలీనం చేసుకుంటే తెలంగాణలో నాయకత్వాన్ని ఎవరికి అప్పగించాలన్న దానిపై సోనియా మల్లగుల్లాలు పడుతోంది. ఒకవేళ కేసీఆర్‌కు పార్టీని అప్పగించే పక్షంలో పిసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్‌, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, మంత్రి జానారెడ్డి లాంటి సీనియర్లను ఎలా మేనేజ్‌ చేయాలన్నదే సోనియా ముందున్న ప్రధాన ప్రశ్న. అంతర్గత కుమ్ములాటల ప్రమాదం పొంచి ఉంటుందని అధిష్టానం నేతలు అభిప్రాయపడుతున్నారు. సామాజికంగా, ఆర్థికంగా భిన్నత్వం అపారంగా ఉన్న తెలంగాణలో నేతలను ఒక్కతాటిపైకి తీసుకురావడం అంత ఆషామాషీ కాదని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. పొత్తు కుదుర్చుకుంటే రెండు పార్టీలకు చెందిన వారికి రాజకీయంగా అవకాశాలు ఇచ్చినట్లు ఉన్నా, సీట్ల పంపకాల్లోనూ ఘర్షణలు తప్పేలా లేవు. సమన్వయం కొరవడితే బొల్తాపడక తప్పదనే భయమూ లేకపోలేదు. అందుకే కెసిఆర్‌తో పొత్తుపైనా చర్చలు సాగుతున్నాయని సమాచారం. దిగ్విజయ్‌సింగ్‌తో తొలుత చర్చలు జరపాలని కేసీఆర్‌కు సోనియా సూచించారు. దీంతో టీఆర్‌ఎస్‌తో పంచాయతీ ముగిశాకే రెండు రాష్టాల్ర ఏర్పాటులో స్పష్టత వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. అందుకే కెసిఆర్‌ డిగ్గీ రాజాతో కలసి భవిష్యత్‌ ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం.