మన్మోహన్‌జీ ధన్యవాద్‌

తెలంగాణ ఆవిర్భావాన్ని ప్రకటించండి
ఎయిమ్స్‌, ఐఐఎం ను ఏర్పాటు చేయండి
ప్రాణహితను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించండి
ప్రధానికి కేసీఆర్‌ వినతి
నేడు నగరానికి రాక, భారీగా స్వాగత ఏర్పాట్లు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ను ఆయన నివాసంలో కలిసారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు తెలంగాణ ప్రజల తరుపున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయనకు ఒక నివేదికను అందజేశారు. తెలంగాణ ఆవిర్భావ తేదీని త్వరగా ప్రకటించాలని రెండురాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలని కేసీఆర్‌ ఆ నివేదికలో విజ్ఞప్తి చేశారు.తెలంగాణ పునర్‌నిర్మా ణానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని ,పారిశ్రామిక రంగంలో తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలని , తెలంగాణలో ఐఐఎం ,ఎయిమ్స్‌ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ ప్రధానమంత్రిని కోరారు. అలాగే ప్రాణహిత – చేవేళ్లకు జాతీయ హోదా ఇవ్వాలని ,హైదరాబాద్‌ మెట్రోపాలిటిన్‌ సిటీగా తీర్చి దిద్దాలని ప్రధానికి ఇచ్చిన నివేదికలో కేసీఆర్‌ పేర్కొన్నారు. కాగా తెలంగాణ ఆకాంక్షను పూర్తి చేసుకుని , ప్రత్యేక తెలంగాణను సాధించుకుని, అరవై ఏళ్ల కల తెలంగాణ రాష్ట్ర సాధనను విజయవంతంగా పూర్తి చేసిన టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ బుధవారం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. పార్లమెంట్‌ సమావేవాల తరవాత ఢిల్లీలో బిజీబిజీగా గడిపిన కెసిఆర్‌ ఇక సొంతగడ్డకు రానున్నారు. సమైక్యాంధ్రలో బయులదేరి తెలంగాణలోనే అడుగుపెడతానని చెప్పిన గులాబీ బాస్‌ ఇక ప్రత్యేక తెలంగాణలోనే అడుగిడబోతున్నారు. ఇందుకు అనుగుణంగా ఆయన తన కార్యక్రమాలను చక్కబెట్టుకుని వస్తున్నారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా, రాహుల్‌, దిగ్విజయ్‌ సింగ్లతో పాటు ప్రధాని మన్మోహన్‌, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, బిజెపినేత రాజ్‌నాథ్‌ లను కలసి కృతజ్ఞతలు తెలిపారు. తన భవిష్యత్‌ కార్యాచరణను కాంగ్రెస్‌ పెద్దలకు తెలపడంతో పాటు వారి మనస్సులో ఉ న్న భావాలనను కూడా తెలుసుకుని వస్తున్నారు. దీంతో ఆయన రాకకోసం టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల కూడా భారీగా స్వాగతం పలికేందుకు సన్నద్దం అవుతున్నాయి. తెలంగాణ గడ్డ విూద కాలు మోపుతున్న తెలంగాణ రథ సారథి కేసీఆర్‌కు కనివిని ఎరుగని ఘనస్వాగతానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. లక్షల సంఖ్యలో ప్రజలను సవిూకరించి నభూతో నభవిష్యతి అనే రీతిలో స్వాగతం పలకాలని టీఆర్‌ఎస్‌ నాయకులు నిర్ణయించారు. ఇందుకోసం భారీగా కార్యకర్తలను సవిూకరిస్తున్నారు. తెలంగాణ జిల్లాల నుంచి వేలాదిగా కార్యకర్తలు హైదరాబాద్‌ చేరుకుంటున్నారు. కేసీఆర్‌ రాక సందర్భంగా భారీ ర్యాలీ జరుగుతుందని, యువకులు, విద్యార్థులు, న్యాయవాదులు, డాక్టర్లు, ఉద్యోగుల వంటి వివిధ రంగాల వారితో స్వాగతం పలికేందకు ఏర్పాట్లు చేవారు. భారీగా కళాకారులు కూడా ఇందులో భాగస్వాములవుతారని, టీఆర్‌ఎస్‌ నగర నాయకులు గుర్రాలు, ఒంటెలతో తరలివస్తారని పార్టీ నాయకులు చెప్పారు. కేసీఆర్‌ స్వాగత కార్యక్రమాలను ఎలా నిర్వహించాలన్నది తెలంగాణ భవన్‌లో పార్టీ నాయకులు చర్చించి అందుకు అనుగుణంగా ప్రణాళిక చేశారు. ఢిల్లీనుంచి ఉదయం బయల్దేరే కేసీఆర్‌ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని అక్కడినుంచి బేగంపేట విమానాశ్రయానికి హెలికాప్టర్లో వస్తారని చెప్పారు. అక్కడ బ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో వెయ్యి మంది బ్రాహ్మణులు పూర్ణ కుంభ స్వాగతం పలుకుతారని, ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కు మతాల గురువులతో సర్వ మత ప్రార్థనలు నిర్వహిస్తారని చెప్పారు. మధ్యాహ్నం రెండు గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి ర్యాలీ ప్రారంభమయి గన్‌పార్క్‌కు చేరుతుంది. ర్యాలీ పొడవునా ప్రధాన కూడళ్ళల్లో వేదికలు ఏర్పాటు చేసి స్వాగతం పలుకుతారని, ధూంధాం కార్యక్రమాలు నిర్వహిస్తారు. గన్‌పార్క్‌ వద్ద కేసీఆర్‌ అమరవీరులకు నివాళి అర్పిస్తారని ఈ సందర్భంగా హెలికాప్టర్లో అమరవీరుల స్థూపం విూద పూలవర్షం కురిపిస్తారని చెప్పారు. అనంతరం తెలంగాణ భవన్‌కు ర్యాలీగా చేరుకుని తెలంగాణ తల్లి ప్రొ. జయశంకర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పిస్తారు. మొత్తంగా టిఆర్‌ఎస్‌ కలనెరవేరడంతో పాటు తెలంగాణ సాధన లక్ష్యం కూడా నెరవేర్చిన కెసిఆర్‌ను ఘనంగా సన్మానించనున్నారు. స్వాగతంతో పాటు సన్మానం కూడా జరునుంది.