తెలంగాణ రాష్ట్రంలోకి కేసీఆర్
దారిపొడవునా నీరా’జనాలు’
గులాబీ వనమైన హైదరాబాద్
అంబరాన్నంటిన సంబరాలు
పోటెత్తిన జనసంద్రం
అమరవీరులకు నివాళి
జయశంకర్ సార్‌కు దండం
తెలంగాణ తల్లికి వందనం
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (జనంసాక్షి) :
టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. ముందుగా చెప్పినట్టుగానే కేసీఆర్ తెలంగాణలోనే నగరంలో అడుగుపెట్టారు. 25 రోజుల తర్వాత నగరానికి చేరుకున్న కేసీఆర్‌కు టీఆర్‌ఎస్ శ్రేణులతో పాటు తెలంగాణ ప్రజలు ఘన స్వాగతం పలికారు. దారిపొడవునా ఆయనకు ప్రజల నీరాజనం పట్టారు. కేసీఆర్ రాక సందర్భంగా హైదరాబాద్ నగరం గులాబీ వనమైంది. బేగంపేట ఎయిర్‌పోర్టుకు బుధవారం సాయంత్రం చేరుకున్న కేసీఆర్ స్వాగత యాత్ర ఐదు గంటలకుపైగా సాగింది. తెలంగాణ అమరవీరులకు ఘన నివాళి అర్పించిన కేసీఆర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్‌కు దండం పెట్టారు. తెలంగాణ తల్లికి వందనం చేశారు.
సాయంత్రం నాలగు గంటల ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరుకున్న కేసీఆర్ అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. బేగంపేటలో ఉద్యమ నేతకు టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ వాదులు ఘన స్వాగతం పలికారు. జై తెలంగాణ, ‘తెలంగాణ గాంధీ’ జిందాబాద్ నినాదాలతో విమానాశ్రయ ప్రాంగణం ¬రెత్తింది. డప్పుల దరువులు, నాయకుల చిందులు వేస్తుండగా ఆయన బయటకు వచ్చి టాప్‌లేని వాహనంలో అభివాదం చేస్తూ బయలుదేరారు. సాయంత్రం 4 గంటలకు బేగంపేట నుంచి గన్‌పార్క్‌కు ర్యాలీగా బయల్దేరారు. తెలంగాణ రాష్ట్రంతోనే తిరిగి హైదరాబాద్‌లో కాలు పెడతానని ప్రకటించి జనవరి 31న ఢిల్లీకి వచ్చిన కేసీఆర్.. 25 రోజుల అనంతరం తిరిగి హైదరాబాద్ వచ్చారు. పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిన తరువాత రాష్ట్రంలోకి అడుగుపెట్టిన తమ పార్టీ అధినేతకు కనీవినీ ఎరుగనిస్థాయిలో ఘనస్వాగతం లభించింది. కేసీఆర్‌తో సాగే ఈ ర్యాలీ దారిపొడవునా, అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్ నివాళులు అర్పించే సమయంలో ఆ ప్రాంతంలోనూ పూలవర్షం కురిపించటానికి ప్రత్యేక హెలికాప్టర్‌ను సైతం సిద్ధం చేశారు. కేసీఆర్ తెలంగాణ విజయోత్సవర్యాలీ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రారంభమైంది. ప్రత్యేక వాహనంపై కేసీఆర్, కేకే, వివేక్, మందా జగన్నాథం గన్‌పార్కకు ర్యాలీగా బయలు దేరారు. లక్షల్లో అభిమానులు ఉద్యమనేతకు స్వాగతం పలికారు. దారి వెంట ఆటపాటలు, డప్పులు, తీన్‌మార్ స్టెప్పులతో ర్యాలీ కొనసాగుతోంది. తెలంగాణలోని సమస్థ కళలు ఈ సందర్భంగా ప్రదర్శిస్తున్నారు. ఒంటెలు, గుర్రాలు, బతుకమ్మలు, బోనాలతో ధూంధాంగా ర్యాలీ నడుస్తోంది. అంతకుముందు గులాబీ బాస్‌కు బేగంపేట ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. వెయ్యమంది వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగం పలికారు. వెయ్యేళ్లు వర్థిల్లాలని సర్వమత ప్రార్థనలతో ఉద్యమ నేతను ఆశీర్వదించారు. ఐదు వందల మంది మహిళలు మంగళహారతులు ఇచ్చి ఆయనకు స్వాగతం పలికారు. కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. నాలుగున్నర తెలంగాణ ప్రజల కలలను నిజం చేసిన ఉద్యమ నేత దాదాపు నెల రోజుల తర్వాత స్వరాష్ట్రంలో అడుగుపెట్టారు. ఏపీ నుంచి వెళ్లి తెలంగాణలోనే అడుగు పెడతానని శపథం చేసి మరీ వెళ్లారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా బేగంపేటకు చేరుకున్నారు. బేగంపేట నుంచి ర్యాలీగా గన్‌పార్క్‌కు చేరుకోనున్నారు. అమరవీరులకు నివాళులర్పించి తెలంగాణ భవన్‌కు రానున్నారు. పార్టీ పెట్టనపుడు జల దృశ్యం వద్ద ఊపయోగించిన ప్రచార రథంపైనే కేసీఆర్ ఇవాళ ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ స్వరాష్ట్రంలో అడుగు పెట్టారు. జయజయ¬ కేసీఆర్.. వర్థిల్లు వెయ్యేల్లు… అంటూ కేసీఆర్‌కు స్వాగతం పలికారు. పోతరాజులు, బతుకమ్మలు, బోణాలతో ఆయనకు హదయపూర్వక స్వాగతం చెప్పారు. కేసీఆర్ రాక కోసం తెలంగాణ జిల్లాలనుంచి లక్షల్లో జనం హైదరాబాద్ చేరుకున్నారు. బాగ్యనగరం గులాబీమయమైంది. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, గులాబీ జెండాలతో హైదరాబాద్ కళకళలాడుతోంది.
కేసీఆర్‌కు స్వాగత సన్నాహాల్లో ప్రధానంగా విలీనంపై ప్లకార్డులు ప్రదర్శించడం విశేషం. డోంట్ మెర్జ్ అంటూ పలువురు కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. అయితే ఇదంతా కావాలనే చేశారా లేక మరేదైనా కారణం ఉందా
అన్నది తెలియదు. అయితే కార్యకర్తుల ఇదేరకమైన నినాదాలు ¬రెత్తించారు. కాంగ్రెస్‌తో పొత్తు మాత్రమే.. విలీనం వద్దంటూ నినాదాలు చేశారు. ఇప్టపికే విలీనంపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చ జరిగినందున ఇక దీనిపై తుదినిర్ణయం తీసుకోనున్న తరుణంలో ఇలాంటి వాదనలు తెరపైకి రావడం విశేషం. అయితే విలీనం వద్దని టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల నుంచి కెసిఆర్‌పై తీవ్ర ఒత్తిడి వస్తోంది. పొత్తు వరకు సరే అన్న భావన కనిపిస్తోంది. అయితే తెలంగాణా వస్తే టిఆర్‌ఎస్ ఉండదు. ఇక అంతా కాంగ్రెసే అన్న కెసిఆర్ వ్యాఖ్యలను ఇప్పుడు సోనియా గుర్తు చేస్తున్నారని తెలుస్తోంది. ఎలాగైనా విలీనానికి సై అనేటట్లు- కెసిఆర్ చేత త్వరగా స్పష్టత ఇప్పించాలని దిగ్విజయ్‌తో పాటు మరో ఇద్దరు పార్టీ పెద్దలకు సోనియా బాధ్యతలు అప్పగించారని ఢిల్లీ వర్గాల సమాచారం. దీంతో టిఆర్‌ఎస్ శ్రేణులు ఆత్మరక్షణలో పడ్డాయి. అందుకే తమ అభిప్రాయాలను ర్యాలీలో సైతం వినిపించారు. అయితే విలీనానికి కెసిఆర్ సుముఖంగానే ఉన్నా, హరీష్‌రావు లాంటి నేతలతో పాటు మెజార్టీ పార్టీ క్యాడర్ మాత్రం కాంగ్రెస్‌తో కలిస్తే తమ పని గల్లంతవుతుందనే భావనలో ఉన్నారు. ఇన్నాళ్లు ఉద్యమంలో పనిచేసిన వాళ్లకు గుర్తింపుతో పాటు సీట్లూ కోల్పోవాల్సి వస్తుందని మదన పడుతున్నారు. దీంతో ఏం చేయాలో కెసిఆర్ తేల్చుకోలేక పోతున్నారు. అయితే అదే సందర్భంలో టిఆర్‌ఎస్ ముఖ్య నేత వినోద్ ఢిల్లీలో చేసిన ప్రకటన కాంగ్రెస్‌కు స్పష్టమైన సంకేతం ఇచ్చింది. ఏదైనా కీలక పదవి ఇస్తే విలీనానికి సిద్ధమే అని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ కొత్తగా ఏర్పడబోయే తెలంగాణా రాష్టాన్రికి తొలి ముఖ్యమంత్రిగా కెసిఆర్‌కు అవకాశమివ్వడానికి సిద్ధమైందనేది తాజా సమాచారం. తెలంగాణాలో మెజార్టీ కాంగ్రెస్ నేతలు కెసిఆర్‌కు సీఎం పదవిచ్చినా అభ్యంతరం లేదంటున్నారు. అయితే కాంగ్రెస్‌కు ఇన్నాళ్లు కొంత బాసటగా ఉన్న రెడ్డి సామాజికవర్గం నుంచి సరైన సానుకూలత రావడం లేదు. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. విలీనం కాకుండా రెండు పార్టీలు పొత్తులతో పోటీ- చేస్తే పరిస్థితి ఏంటనేది ప్రస్తుత చర్చ. కానీ టిఆర్‌ఎస్ అడుగుతున్న పది ఎంపీ సీట్లలో ఆ పార్టీ గెలిచి.. రేపు యూపీఏ రాకుండా వేరే కూటమి వస్తే.. దానికి కెసిఆర్ మద్దతివ్వరని గ్యారంటీ- ఏంటనేది కాంగ్రెస్ పెద్దల అనుమానంగా ఉంది. తెలంగాణాలో 119 సీట్లలో 75 సీట్లు టీఆర్‌ఎస్‌కు ఇచ్చి మిగతా 44 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసేటట్టు వ్యూహాం రచిస్తున్నారని సమాచారం. అయితే ఏదేమైనా మరికొంత సమయం పట్టేలా ఉంది. ఈలోగా మరింతగా చర్చసాగనుందని తెలుస్తోంది.
60 ఏండ్ల కలను సాకారం చేసి తెలంగాణ రాష్టాన్రికి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తిరిగిరావడంతో తమతో పాటు తెలంగాణ ప్రజలు ఉద్వేగానికి, ఉద్విగ్నతకు లోనవుతున్నారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా హైదరాబాద్‌కు తరలి వచ్చి తమ అభిమాన నేతకు స్వాగతం పలకాలన్న ఆకాంక్ష చాటారనన్నారు. తెలంగాణ ప్రజల్లో గూడుకట్టుకున్న అభిమానం కళ్లారా చూస్తున్నామని అన్నారు. ఈ అపూర్వ సంఘటనను ఆయన మదిలో చిరస్థాయిగా నిలపాలని ఆశిస్తూ టీఆర్‌ఎస్ శ్రేణులు బేగంపేట విమానశ్రయంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ముందుశ్రేణిలో ఒంటెలు, తర్వాత ఏనుగులు, అటు తరువాతి వరుసలో కళాకారులు తమ ఆటపాటలతో విజయోత్సవ ర్యాలీని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆపార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు మాట్లాడుతూ.. ప్రతిఒక్క కార్యకర్త, అభిమాని సంయమంనంతో వ్యవహరించి ర్యాలీని విజయవంతం చేయడానికి వచ్చారని అన్నారు. వారి అభిమానాన్ని మాటల్లో చెప్పలేమన్నారు. ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీకి వెళుతున్న స్వరాష్ట్ర కల సాకారం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడతానన్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఆపార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.