రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన
కేబినెట్ నిర్ణయం
నేడు దస్త్రంపై రాష్ట్రపతి సంతకం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28 (జనంసాక్షి) :
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. ఊగిసలాటకు తెరదించుతూ ఆంధప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మన్మోహన్‌సింగ్ నివాసంలో శుక్రవారం ఉదయం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేబినేట్ రాష్ట్రపతికి సిఫారసు చేసింది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడడమే ఇక తరువాయి. రాష్ట్రపతి ఆమోదం తెలిపిన వెంటనే ఆంధప్రదేశ్‌లో గవర్నర్ చేతికి పాలనా పగ్గాలు వెళతాయి. ఫిబ్రవరి 21న కిరణ్‌కుమార్‌రెడ్డి సిఎంగా రాజీనామా చేయడం, ప్రభుత్వ ఏర్పాటుకు సాధ్యం కాకపోవడంతో రాష్ట్రపతి పాలనకు కేంద్రం మొగ్గు చూపింది. గత వారం రోజులులగా కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై తర్జనభర్జన పడిన కేంద్రం ఎట్టకేలకు రాష్ట్రపతి పాలనకే సిఫారసు చేసింది. ప్రభుత్వ ఏర్పాటుపై రాష్ట్ర నేతలు మొగ్గు చూపినా మూడు నెలల కోసం, అదికూడా ఎన్నికలకు ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రవిభజన నేపథ్యంలో ఫిబ్రవరి 18న లోక్‌సభ, 20న రాజ్యసభ బిల్లును ఆమోదించింది. దీంతో 21న కిరణ్‌కుమార్‌రెడ్డి సిఎం పదవికి రాజీనామా చేశారు. తనను ఆపద్ధర్మ సిఎంగా కూడా కొనసాగించవద్దని కోరారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేసినా పరిస్థితులు కలిసి రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 1956 తర్వాత ఆంధప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన రావడం ఇది రెండోసారి. 1973లో జై ఆంధ్రా ఉద్యమ సమయంలో నాటి ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు రాజీనామాతో రాష్ట్రపతి పాలన విధించారు. 1954లో ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పటి సంకీర్ణ ప్రభుత్వం కాంగ్రెస్, ఆంధ్ర ప్రజా పార్టీలతో కలిసి నడిచేది. టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం శాసనసభలో నెగ్గడంతో ప్రకాశం రాజీనామా చేశారు. అదే సమయంలో రాష్ట్ర శాసనసభను కూడా రద్దు చేశారు. నవంబరు 15, 1954 నుంచి రాష్ట్రం రాష్ట్రపతి పాలనలోకి వెళ్లింది. 1955 ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలు జరగడంతో మళ్లీ మార్చి 28, 1955లో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. నాలుగు నెలల 13 రోజుల పాటు రాష్ట్రాన్ని గవర్నర్ పరిపాలించారు. సమైక్య ఆంధప్రదేశ్ రాష్ట్రంలో జై ఆంధ్రా ఉద్యమ సమయంలో చెలరేగిన పరిణామాల నేపథ్యంలో రాష్ట్రపతి పాలన పెట్టారు. 1973 జనవరి 17న అప్పటి ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు తన పదవికి రాజీనామా చేశారు. మరుసటి రోజు నుంచే రాష్ట్రపతి పాలనకు తెరతీశారు. 1973 డిసెంబరు 10న జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయడంతో రాష్ట్రపతి పాలనకు తెరపడింది. ఇక పోలవరం ముంపు మండలాలు సీమాంధ్రకు బదలాయింపు అర్డినెన్స్‌పై నిర్ణయం వాయిదా పడింది. ఆంధప్రదేశ్ రాష్ట్రంలో 41 సంవత్సరాల తర్వాత మళ్లీ రాష్ట్రపతి పాలన విధిస్తున్నారు. దీంతో రాష్ట్ర చరిత్రలో రెండోసారి రాష్ట్రపతి పాలన వచ్చినట్లవుతుంది. దేశంలోని వివిధ రాష్టాల్ల్రో ఇప్పటి వరకు 122 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. అత్యధికంగా మణిపూర్ రాష్ట్రంలో ఇప్పటికి 10 సార్లు విధించారు. తర్వాత ఉత్తరప్రదేశ్‌లో 9 సార్లు, బీహార్‌లో 8 సార్లు, పంజాబ్‌లో 8 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ఇక కర్ణాటక, ఒడిశా, పుదుచ్చేరిలలో ఆరేసి సార్లు రాష్ట్రపతి పాలన వచ్చింది. మన రాష్ట్రంలో మాత్రం ఇప్పటికి ఒక్కసారే విధించగా, మరోసారి ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెడుతున్నారు. రాష్ట్రపతి పాలన వస్తే.. శాసన వ్యవస్థ అంటూ ఉండదు. అధికారాలన్నీ గవర్నర్ చేతిలో ఉంటాయి. రాష్ట్రపతి ప్రతినిధిగా గవర్నరే పాలన కొనసాగిస్తారు. ప్రస్తుత గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ గతంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు మన రాష్ట్రంలోనే ఐపీఎస్ అధికారిగా పనిచేశారు. కాబట్టి, రాష్ట్రపతి పాలన గురించి కూడా ఆయనకు అవగాహన ఉంది. రాష్ట్రపతి పాలన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతిని గవర్నర్ నరసింహన్ ప్రత్యేక కార్యదర్శి రమేష్ కుమార్ కలిశారు. వారిద్దరి మధ్య పాలనకు సంబంధించిన చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. వాస్తవానికి మహంతి పదవీ కాలం పూర్తయినా.. రాష్ట్ర విభజన, రాష్ట్రపతి పాలన లాంటి కీలక ఘట్టాలు ఉండటంతో ఆయన పదవీకాలం పొడిగించిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి మండలి సమావేశం ప్రధాని నివాసంలో ఉదయం ప్రారంభమైంది. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు కూడా మంత్రిమండలి సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి మండలి అజెండాలో ఆంధప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన అంశం కూడా ఉండడంతో ఇక రాష్ట్రపతి పాలన తప్పదని తేలిపోయింది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా కూడా హాజరయ్యారు. అయితే పోలవరం ముంపు మండలాలు సీమాంధ్రకు బదలాయింపు అర్డినెన్స్‌పై నిర్ణయం వాయిదా పడింది.