తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకూ ఆమోదం :

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రానికి సంబంధించిన రెండు కీలక దస్త్రాలపై సంతకం చేశారు. రాష్ట్ర పునర్విభజన బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. అలాగే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకూ ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పటికే పార్లమెంట్‌ ఆమోదించిన టీ బిల్లు చట్టంగా మారింది. రాష్ట్రంలో గవర్నర్‌ చేతికి పాలనా పగ్గాలు అందాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇవాళే గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా వెలువడే ఛాన్స్‌ ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తేదీ ఎప్పుడూ అనేది ఆసక్తికరంగా మారింది. బహుషా ఎన్నికల అనంతరం మే నెలలో అపాయింటెడ్‌ తేదీ ఉంటుందని ¬ంశాఖ వర్గాలు చెబుతున్నాయి. రెండు రాష్ట్రాలకు సంబంధించి విభజన అనంతర ప్రక్రియపై ఇంకా కొంత కసరత్తు చేయాల్సి ఉన్నందున అపాయింటెడ్‌ డేట్‌కు కొంత సమయం తీసుకునే అవకాశముంది. ఎన్నికలు పూర్తియి రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడే నాటికి ఆవిర్భావ తేదీని నిర్ణయించే ఛాన్సు ఉంది. అయితే ఈ తేదీ ఎప్పుడనేది మాత్రం రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశముంది.

రాష్ట్రపతి పాలనకు ప్రణబ్‌ ఆమోదం :

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన ఫైల్‌పై ఆయన ఇవాళసంతకం చేశారు. దీంతో ఈ రోజే నోటిఫైడ్‌ తేదీగా పరిగణనలోకి వస్తుంది. అంటే ఇవాల్టీ నుంచి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులోకి వస్తుంది. ఢిల్లీ నుంచి గవర్నర్‌కు సమాచారం అందగానే పాలనా పగ్గాలు ఆయన చేతిలోకి వస్తాయి.