ఎన్నికలకు సర్వంసిద్ధం :కలెక్టర్‌

ఆదిలాబాద్‌, మార్చి 7 : మున్సిపల్‌, సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి డాక్టర్‌ అహ్మద్‌ బాబు తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులో ఉందని, ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 19.70 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, వీరు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు. ఈ నెల 30న మున్సిపల్‌ ఎన్నికలు, ఏప్రిల్‌ 30న అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలకు సిబ్బందిని కూడా నియమించామన్నారు. జనవరి మాసంలో 2.10 లక్షల మంది కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, ఓటర్లుగా నమోదు చేసుకోని వారికి మరోసారి అవకాశం ఇస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 9న అన్ని పోలింగ్‌ కేంద్రాలను ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు  తమ పేరును నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేవలం ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుందే తప్ప, ఎలాంటి సవరణలు కాని, తప్పులను సవరించే అవకాశం లేదన్నారు. కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకునే వారు కేవలం సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకే అవకాశం కల్పిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఎంపీ స్థానానికి పోటీ చేసేవారు రూ. 70లక్షలు, ఎమ్మెల్యేగా పోటీ చేసేవారికి రూ.28 లక్షలు, మున్సిపల్‌ వార్డుకు పోటీ చేసేవారు రూ.లక్ష వరకు ఖర్చు చేయవచ్చని అన్నారు. అభ్యర్థులు ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ప్రతి రాజకీయ పార్టీకి ఎన్నికల నియమావళి గురించి ప్రత్యేక వర్క్‌షాపును ఏర్పాటు చేశామన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో 438 ఈవీఎంలను, సార్వత్రిక ఎన్నికల్లో 4వేల ఈవీఎంలను వాడుతున్నామన్నారు. మున్సిపల్‌ ఎన్నికలకు 2వేల మంది సిబ్బందిని, సార్వత్రిక ఎన్నికలకు 14వేల మంది సిబ్బందిని నియమించామన్నారు. ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని , అన్ని వర్గాల ప్రజలు, మీడియా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ భూపాల్‌, జేసీ లక్ష్మీకాంతం, ఐటీడీఏ పీఓ శ్రీనివాస్‌, సబ్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.