సంతోష్ ట్రోఫీ ఫైనల్లో రైల్వేస్ , మిజోరాం
సిలిగురి .మార్చి 8 :జాతీయ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ సంతోష్ ట్రోఫీ టైటిల్ పోరుకు రైల్వేస్ , మిజోరాం సిధ్ధమయ్యాయి. సిలిగురి వేదికగా ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 48 ఏళ్ళ తమ నిరీక్షణకు ఈ సారి టైటిల్ గెలవడం ద్వారా తెరదించాలని రైల్వేస్ భావిస్తోంది. ఆ జట్టు చివరిసారిగా 1966లో సంతోష్ ట్రోఫీ గెలుచుకుంది. అలాగే 27 ఏళ్ళ తర్వాత ఫైనల్‌కు చేరుకున్న రైల్వేస్ ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తోంది. గతంలో ఆ జట్టు మూడుసార్లు టైటిల్ గెలుచుకోగా… ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు మిజోరాంను కూడా తక్కువ అంచనా వేసేందుకు వీలులేదు. ఎందుకంటే ఈ టోర్నీ అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు విజయం సాధించింది. తొలిసారి టైటిల్ గెలవడం ద్వారా చరిత్ర సృష్టించాలని మిజోరాం భావిస్తోంది. ఇదిలా ఉంటే రైల్వేస్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగింది. అస్సాం చేతిలో ఓడిన ఆ జట్టు తర్వాత గోవాను 3-0తో ఓడించి సెవిూస్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందని అంచనా వేస్తున్నారు.



