మూడో రోజూ చిక్కని విమానం ఆచూకీ

రంగంలోకి దిగిన ఎఫ్‌బీఐ
కౌలాలంపూర్‌, మార్చి 10 (జనంసాక్షి) :
అదృశ్యమైన మలేషియన్స్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఆచూకీ మూడు రోజులైనా చిక్కలేదు. అంతుచిక్కకుండా అదృశ్యమైన విమాన ఆచూకీ కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఇద్దరు వ్వక్తులు అపహరించిన పాస్‌పోర్టులతో గల్లంతైన విమానంలో ప్రయాణించారన్న విషయాన్ని ఇంటర్‌పోల్‌ నిర్దారించడంతో విమానం అదృశ్యం వెనక ఉగ్రవాదుల పాత్ర ఉందేమోనన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. ఇంటర్‌పోల్‌కి చెందిన మరో ప్రతినిధి కథనం ప్రకారం మలేషియా విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరి దస్త్రాలు పరిశీలించగా రెండు కన్నా ఎక్కువే అనుమానిత పాస్‌పోర్టులు ఉన్నట్లు తెలుస్తోంది. అవి ఎన్ని, ఏ దేశానికి చెందినవి అన్నది మాత్రం నిర్థారించలేదు. ఆదివారం అన్వేషణ తీవ్రతరం చేసిన అధికారులు సోమవారం వరకూ ఏవిధమైన ఆధారాలు లభించినట్లు ప్రకటించలేదు. ఒకవేళ విమానం హైజాక్‌కు గురయిందేమోనన్న అనుమానాన్నీ కొట్టిపడేయలేమని మలేషియా ఏవియేషన్‌ చీఫ్‌ అబ్దుల్‌ రహమాన్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం విమానం ఆచూకీ తెలుసుకోవడం తమ ముందున్న ప్రధాన కర్తవ్వమని పేర్కొన్నారు. తప్పిపోయిన విమానాన్ని గాలిస్తున్న మరో విమానంలో నుంచి ఫొటో తీసినప్పుడు సముద్రంపై కనిపిస్తున్న ఓ షిప్‌ ఆధారంగా వియత్నాం, మలేషియా సముద్ర జలాల్లో గాలింపు కొనసాగుతోంది. అయితే ఆ విమానం దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. 239 మంది ప్రయాణికులతో మలేషియా రాజధాని కౌలాలంపూర్‌ నుంచి బీజింగ్‌కు బయలుదేరిన ఈ విమానం వియత్నాం దక్షిణ భాగంలో అదృశ్యమైనట్లు శనివారం తెల్లవారుజామున వార్తలు వెలువడ్డాయి. వియత్నాం సముద్ర జలాలతో పాటు మలేషియా సముద్ర జలాల్లోనూ గాలింపుచర్యలు చేపట్టినట్టు మలేషియా అధికారవర్గాలు తెలిపాయి. దాదాపు 40 నౌకలు, 34 విమానాలు ఈ గాలింపులో పాల్గొంటున్నాయి. వియత్నాం సముద్రతీరంలో తేలిన చమురు తెట్టుపై గాలింపు చేపట్టిన వియత్నాం నావికాదళానికి అక్కడ ఎలాంటి విమానశకలాలు లభ్యం కాలేదు.