చెన్నైసూపర్ కింగ్స్ పై బెంగళూర్ ఛాలెంజర్స్ విజయం

రాంచీ:ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ చెన్నై తో జరిగిన కీలక మ్యాచ్ లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై విసిరిన 139 పరుగుల లక్ష్యాన్ని బెంగళూర్ ..ఇంకా ఒక బంతి మాత్రమే మిగిలి ఉండగా విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలను నిలుపుకుంది. బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ ఓపెనర్లు ఓపెనర్ పార్ధీవ్ పటేల్ (10) పరుగులు చేసి పెవిలియన్ చేరినప్పటికీ, క్రిస్ గేల్ (46) పరుగులతో ఆదుకున్నాడు. అనంతరం విరాట్ కోహ్లి(27) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మ్యాచ్ చివర్లో ఏబీ డివిలియర్స్(28) పరుగులను దూకుడుగా చేయడంతో బెంగళూర్ గెలుపొందింది. చెన్నై బౌలర్లలో అశ్విన్ ,డేవిడ్ హస్సీలకు తలో రెండు వికెట్లు లభించగా, జడేజాకు ఒక వికెట్టు దక్కింది.

అంతకుముందు టాస్ గెలిచిన చెన్నై తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నై ఓపెనర్లు స్మిత్ (9), మెక్ కలమ్(19) ఆదిలోనే పెవిలియన్ కు చేరి అభిమానులకు షాకిచ్చారు. అనంతరం సురేష్ రైనా , డేవిడ్ హస్సీలు బాధ్యాతయుతంగా ఆడటంతో చెన్నై తేరుకుంది. హస్సీ(25) పరుగులతో ఫర్వాలేదనిపించినా, కెప్టెన్ ధోని (7) పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. కాగా రైనా(62; 48 బంతుల్లో 6ఫోర్లు, 1 సిక్స్) చివరివరకూ క్రీజ్ లో ఉండి చెన్నై 138 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. బెంగళూర్ బౌలర్లలో ఆరూన్ కు రెండు వికెట్లు లభించగా, మురళీధరన్, అహ్మద్ లకు తలో వికెట్టు లభించింది.