పంజాబ్ భల్లే భల్లే
ఈ సీజన్‌లో కింగ్స్ లెవన్ పంజాబ్ హవా కొనసాగుతోంది. లీగ్ దశలో పంజాబ్ పదో విజయం సాధించింది. గెలిస్తే ప్లేఆఫ్ చేరే మ్యాచ్‌లో రాజస్థాన్ చతికిలపడింది. ఇక వాట్సన్ సేన ఆఖరి మ్యాచ్‌లో ముంబైపై నెగ్గితే నేరుగా నాకౌట్ దశకు చేరుకుంటుంది. ఇప్పటికీ ముంబై, సనరైజర్స్ సాంకేతికంగా ప్లేఆఫ్ రేసులో ఉన్నాయి.
మొహాలీ: కింగ్స్ లెవన్ పంజాబ్ మరోసారి అదరగొట్టింది. శుక్రవారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 16 పరుగుల తేడాతో రాజస్థాన్‌పై విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 180 పరుగులు లక్ష్య ఛేదనలో వాట్సన్ సేన 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేసింది. హాడ్జ్ (18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 31), ఫాల్క్‌నర్ (13 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 35 నాటౌట్) పోరాడినా ఓటమి తప్పలేదు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ షాన్ మార్ష్ (35 బంతు ల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 40), మిల్లర్ (29 నాటౌట్), బెయిలీ (26 నాటౌట్) రాణించడంతో తొలుత.. పంజాబ్ 4 వికెట్లకు 179 పరుగులు చేసింది.
తడబడ్డ రాజస్థాన్: లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. ఆరంభంలోనే ఓపెనర్ కరుణ్ నాయర్ (11) తొలి వికెట్‌గా అవుటయ్యాడు. ఈ దశలో రహానె-శాంసన్ ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే 9వ ఓవర్‌లో రహానె (23), వాట్సన్ (0)ను అవుట్ చేసి రిషి రాజస్థాన్‌ను దెబ్బకొట్టాడు. తర్వాత బిన్నీ (7) నిరాశపర్చాడు. చివర్లో గెలుపునకు రాజస్థాన్ 42 బంతుల్లో 97 రన్స్ చేయాల్సి వచ్చింది. ఈ దశలో ప్రమాదకర శాంసన్ (30), రాహుల్ (16) అవుటయ్యారు. చివర్లో హాడ్జ్, ఫాల్క్‌నర్ పోరాడినా జట్టును గెలిపించలేక పోయారు.
రాణించిన మార్ష్: అంతకుముందు టాస్ కోల్పోయి పంజాబ్ బ్యాటింగ్‌కు దిగింది. ఇప్పటికే ప్లేఆఫ్ చేరడంతో స్టార్ బ్యాట్స్‌మన్ మాక్స్‌వెల్‌కు విశ్రాంతి ఇచ్చారు. ఈ మ్యాచ్‌లోనూ పటిష్ట పంజాబ్ టాపార్డర్ సత్తా చాటింది. తొలి ఓవర్‌లోనే సెహ్వాగ్ 4, 4, 6తో జోరు ప్రదర్శించాడు. అయితే ఫాల్క్‌నర్ వేసిన మూడో ఓవర్‌లో సెహ్వాగ్ తొలి బంతిని ఫోర్ కొట్టి.. రెండో బంతికి క్యాచ్ అవుటయ్యాడు. ఆనక ఓహ్రాతో జతకట్టిన మార్ష్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. 4, 5 ఓవర్లలో ఓహ్రా 4, 6 కొట్టగా.. మార్ష్ రెండు ఫోర్లు దంచాడు. వికెట్ల మధ్య నిస్సత్తువగా పరుగెత్తిన ఓహ్రా (25) రనౌటయ్యాడు. క్రీజులోకి వచ్చిన సాహా కూడా వేగంగా ఆడాడు. వీరిద్దరూ బౌండ్రీలతో విరుచుకుపడడంతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది. అయితే స్వల్ప తేడాతో మార్ష్, సాహా (27) అవుటయ్యారు. చివరి మూడు ఓవర్లలో పంజాబ్ 46 పరుగులు రాబట్టింది. మిల్లర్-బెయిలీ ఐదో వికెట్‌కు 60 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పడంతో పంజాబ్ 170 మార్కు దాటింది.
పంజాబ్: సెహ్వాగ్ (సి) మాలిక్ (బి) ఫాల్క్‌నర్ 18, ఓహ్రా (రనౌట్) 25, మార్ష్ (సి) రహానె (బి) మాలిక్ 40, సాహా (సి) రహానె (బి) రాహుల్ 27, మిల్లర్ (నాటౌట్) 29, బెయిలీ (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 179/4;
వికెట్ల పతనం: 1-24, 2-54, 3-113, 4-119; బౌలింగ్: మాలిక్ 3-0-29-1, వాట్సన్ 2-0-16-0, ఫాల్క్‌నర్ 3-0-39-1, కూపర్ 4-0-25-0, రాహుల్ 4-0-24-1, తాంబె 4-0-36-0.
రాజస్థాన్: రహానె (బి) రిషి 23, నాయర్ (సి) బెయిలీ (బి) బాలాజీ 11, శాంసన్ (స్టంప్డ్) సాహా (బి) కరణ్‌వీర్ 30, వాట్సన్ (బి) రిషి 0, బిన్నీ (సి) మార్ష్ (బి) కరణ్‌వీర్ 7, రాహుల్ (సి) కరణ్‌వీర్ (బి) అక్షర్ 16, హాడ్జ్ (స్టంప్డ్) సాహా (బి) అక్షర్ 31, ఫాల్క్‌నర్ (నాటౌట్) 35, కూపర్ (సి) మార్ష్ (బి) అక్షర్ 2, మాలిక్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 163/8;
వికెట్ల పతనం: 1-21, 2-56, 3-56, 4-70, 5-83, 6-101, 7-128, 8-130; బౌలింగ్: బాలాజీ 4-0-37-1, హెండ్రిక్స్ 4-0-57-0, రిషి 4-0-25-2, అక్షర్ 4-0-24-3, కరణ్‌వీర్ 4-0-16-2.
ప్లే ఆఫ్ రేసులో ముంబై, సన్‌రైజర్స్!
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓటమితో.. ముంబై, సన్‌రైజర్స్ ప్లే ఆఫ్ రేసులో నిలిచాయి. అయితే ఈ రెండు జట్లు తమ చివరి మ్యాచ్‌లో నెగ్గి.. రాజస్థాన్ ఆఖరి మ్యాచ్‌లో ఓడాల్సి ఉంటుంది. అప్పుడు లీగ్ దశలో ఎక్కువ విజయాలు సాధించిన జట్టుకు చాన్స్ ఉంటుంది. గెలుపులూ సమానంగా ఉంటే.. నెట్ రన్‌రేట్ చూస్తారు. ఇది కూడా సమానంగా ఉంటే.. అత్యధిక వికెట్లు తీసిన జట్టు ప్లే ఆఫ్ చేరుతుంది.