నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి సోనియా గాంధి, రాహుల్
న్యూ ఢిల్లీ, మే 26: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి సరిగ్గా అరగంట ముందు యుపిఏ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి, కుమారుడు రాహుల్‌తో కలిసి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వస్తూనే ఆమె అక్కడ కనిపించినవారందరికీ నమస్కారం చేశారు. ఆమెను చూడగానే ఎల్ కె అడ్వాణీ లేచి నిల్చుని ఆమెకు ప్రతి నమస్కారం చేశారు. అడ్వాణీ ఆమెను కుశలప్రశ్నలు కూడా వేశారు.
ఆ తర్వాత భద్రతా సిబ్బంది మార్గం చూపించడంతో సోనియా ముందుకు నడుచుకుంటూ వెళ్లారు. దారిలో కనిపించిన భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రణామం చేస్తూ ఆమె ముందుకు కదిలారు. సోనియా రావడంతో అప్పటికే ఆసీనురాలైన మాజీ స్పీకర్ మీరా కుమార్ లేచి నిల్చున్నారు. ఇంకాస్త ముందుకు వెళ్లాక సోనియా, రాహుల్‌లను భద్రతా సిబ్బంది కూర్చోబెట్టారు. ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి ప్రతిభా భారతి దంపతులు కూడా వచ్చి వారి పక్కన కూర్చున్నారు.