న్యూఢిల్లీ (ఇఎన్ఎస్): మంగళవారం ఉదయం.. తమ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రి ఢిల్లీలో రోడ్డుప్రమాదానికి గురయ్యారని తెలియగానే పరాలి పట్టణం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. మహారాష్ట్రలోని బీద్ జిల్లాలోని పరాలి కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే స్వస్థలం. ఆయన ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగిందన్న వార్త వినగానే పరాలి పట్టణం దిగ్భ్రాంతి చెందింది. వార్త బయటకు పొక్కగానే ఒక్కసారిగా జనం వీధుల్లోకి వచ్చేశారు. తమ ప్రాంతానికి చెందిన మంత్రికి ఏమీ కాకూడదని, క్షేమంగా తిరిగిరావాలని కోరుకుంటూ అనేకులు వీధుల్లోనే ప్రార్థనలు చేశారు. స్వల్ప ప్రమాదం అంటూ మొదట్లో వార్తలు రావడంతో ఆయన ప్రమాదంనుంచి బయట పడనట్లేనని అందరూ భావించారు. కాని నిమిషాల వ్యవధిలోనే ఆయన మరణ వార్త వ్యాపించడంతో ఆయన మద్దతుదారులు కుప్పగులిపోయారు. కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సొంత జిల్లా అయిన బీద్‌లో జరిగే సత్కార కార్యక్రమంలో పాల్గొనడానికి కేంద్రమంత్రి మంగళవారం ఉదయం ఢిల్లీనుంచి ఇందిరాగాందీ విమానాశ్రయానికి బయలు దేరారు. సన్మాన సభ మంగళవారం సాయంత్రం జరగాల్సి ఉంది. మంత్రి కాస్సేపట్లో తమను కలుస్తారని, అందరిని పలకరిస్తారని భావించిన స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఆయన మరణ వార్తతో నిశ్చ్యేష్టులయ్యారు. ప్రమాదవార్త తెలియగానే ఆయన కుటుంబ సబ్యులు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం తర్వాత ఆయన మృతదేహాన్ని లాతూరుకు తీసుకువస్తారని, అనంతరం ఆయన స్వస్థలమైన పరాలికి చేరుస్తారని పార్టీవర్గాలు తెలిపాయి. బుధవారం ఉదయం మంత్రి గోపీనాధ్ ముండే అంత్యక్రియలు జరుగనున్నాయి.