పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్‌ప్రెస్
ఐదుగురి మృతి, ఎనిమిది మందికి గాయాలు
మావోయిస్టులపై నెపం తొందరపాటు చర్య
కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్
ముమ్మాటికి నిర్లక్ష్యమే
బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్
న్యూఢిల్లీ, జూన్ 25 (జనంసాక్షి):రాజధాని ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైంది. ఢిల్లీ నుంచి డిబ్రుగఢ్ వెళ్తుండగా బీహార్‌లోని చప్రా గోల్డెన్ గంజ్ వద్ద బుధవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఈ
ఘటనలో ఐదుగురు మృతి చెందగా, ఎనిమిది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇది ప్రమాదమా? లేక విద్రోహ చర్య అన్నది ఇంకా గుర్తించలేదు. బీహార్‌లో నక్సల్స్ బంద్‌కు పిలుపునిచ్చన తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, దీనిపై ఇప్పుడే ఏ విషయాన్ని కొట్టిపడేయలేమని కేంద్ర ¬ం శాఖ స్పష్టం చేసింది. కాగా ప్రమాదంపై మేజిస్టీరియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బాధితుల కుటంబాల కోసం రైల్వే శాఖ ప్రత్యేక హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. మరోవైపు, ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. తెల్లవారుజమున 2 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 12 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాద విషయం తెలియగానే రైల్వే అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన రైలు నుంచి ప్రయాణికలుందరినీ సమీపంలోని మరో స్టేషన్‌కు తరలించారు. వారిని స్వగ్రామాలు తరలించేందుకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేశారు. బీ-1, బీ-2, బీ-3, బీ-4లతో పాటు పాంటీ కార్ పూర్తిగా పక్కకు పడిపోగా, మిగతా ఏడు బోగీలు పట్టాలు తప్పాయని రైల్వే అధికార ప్రతినిధి అనీల్ సెక్సేనా తెలిపారు. ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ప్రమాదమా.. విద్రోహ చర్యా..?
రైలు ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీహార్‌లో మావోయిస్టులు బుధవా రం బంద్‌కు పిలుపునిచ్చారు. మావో సానుభూతిపరుల పేరుతో అమాయక ప్రజలను వేధిస్తుండడాన్ని నిరసిస్తూ బంద్ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే రైలు ప్రమాదం జరగడం పై సందేహాలు నెలకొన్నాయి. రైలు పట్టాలు తప్పడం వెనుక మావోయిస్టుల హస్తం ఉండొచ్చని రైల్వే శాఖ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ‘ప్రాథమిక ఆధారాలు పరిశీలిస్తుంటే ఇది విద్రోహ చర్యగా కనిపిస్తోంది. పట్టాలను పేల్చేయడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చని’ రైల్వే బోర్డు చైర్మన్ అరుణెళింద్ర కుమార్ తెలిపారు. స్టేషన్‌కు 60 కిలోమీటర్ల దూరంలో మరో గూడ్స్ రైలు కూడా పట్టాలు తప్పిందని చెప్పారు. పట్టాలను పేల్చేయడం వల్ల 18 వ్యాగన్లు పట్టాలు తప్పాయని ఆయన వెల్లడించారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది.
మృతులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా
రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రమాద మృతులకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు రైల్వే మంత్రి డీవీ సదానందగౌడ ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.20 వేల చొప్పున చెల్లిస్తామన్నారు. సీనియర్ అధికారులంతా ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదం వెనుక నక్సలైట్ల హస్తం ఉండొచ్చన్న వార్తలను ఆయన కొట్టిపడే శారు. ప్రమాదవశాత్తు జరిగినదేనని తెలిపారు. అయినా రైల్వే భద్రతా కమిషన్‌తో విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సంతాపం తెలిపారు. ప్రమాద ఘటనలో మావోయిస్టుల పాత్రపై ఇప్పుడే చెప్పలేమన్నారు.
నిర్లక్ష్యమే కారణం..
రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి రైల్వే నిర్లక్ష్యమే కారణమని బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ అన్నారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముందు పెట్రోలింగ్ ఇంజిన్‌ను నడపాలనేది నియమమని, ఆ నియమాన్ని ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు. రైలు మార్గం బాగుందా..? సురక్షితమేనా? అనే అంశాలు దాని ద్వారానే తెలుస్తాయి. కానీ పెట్రోలింగ్ ఇంజిన్ నడపకుండా రైలును అనుమతించడం సమంజసమేనా? అని ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరైనా వారిని రక్షించేందుకు ప్రయత్నించకూడదని కోరారు. కాగా, రైలు ప్రమాదానికి మావోయిస్టులే కారణమని చెప్పడం ముందస్తు వ్యాఖ్యలేనని ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ప్రధానమంత్రి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని చెప్పారు. పూర్తి వివరాలు వచ్చే వరకు దీనిపై వ్యాఖ్యానించడం సరికాదన్నారు.