9 నుంచి ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ : ధోనీకి అగ్నిపరీక్ష!

 

ఈనెల 9వ తేదీ నుంచి ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్ట్ సిరీస్ ఆరంభంకానుంది. ఈ సిరీస్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అగ్నిపరీక్షలా మారనుంది. టెస్ట్ మ్యాచ్ ఫలితం పక్కనబెడితే.. తొలి టెస్ట్ మ్యాచ్‌కు జట్టు సభ్యుల ఎంపిక కత్తిమీదసాములా మారింది. 
స్పిన్‌కు ఏమాత్రం అనుకూలించని ఇంగ్లండ్ పిచ్‌లపై స్పిన్నర్ల ఎంపికపై ధోనీతో పాటు.. కోచ్ డంకన్ ఫ్లెచర్ మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ మ్యాచ్ కోసం ఇద్దరు స్పిన్నర్లను తీసుకునే సాహసం చేయాలా వద్దా అనేది వారిద్దరు ఆలోచన చేస్తున్నారు. తుది జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకోవాలా? రవీంద్ర జడేజాను తీసుకోవాలా? అన్నదానిపై కోచ్ ఫ్లెచర్‌తో కలిసి మల్లగుల్లాలు పడుతున్నాడు.
ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ ఉపయుక్తంగా ఉంటాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన జడేజా అయితే బ్యాటింగ్‌లో పూర్. కానీ, బౌలింగ్‌లో ఫరవాలేదనిపిస్తున్నాడు. ప్రస్తుతం అశ్విన్ ఫామ్‌లో లేకపోవడంతో ఎవరివైపు మొగ్గాలో ధోనీకి చిక్కుప్రశ్నలా మారింది. 
ఇంగ్లండ్ గడ్డపై రెండు ప్రాక్టీసు మ్యాచ్‌లలోనూ వీరిద్దరి ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఒక ఇన్నింగ్స్‌లో రాణిస్తే, మరో ఇన్నింగ్స్‌లో విఫలమయ్యారు. వీరుకాకుండా జట్టులో మరో నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం టీమ్ సెలక్షన్‌పై ప్రభావం చూపనుంది. కాగా, ఈ టూర్‌లో భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్‌లను ఆడనుంది.