తెలంగాణ బంద్ సంపూర్ణం
స్తంభించిన జనజీవనం
బస్సులు డిపోలకే పరిమితం
నిలిచిపోయిన రాకపోకలు
ఆదివాసీలను ముంచే ప్రాజెక్టు కట్టనియ్యం
ఫెడరల్ స్ఫూర్తికి ఇది విరుద్ధం
దశలవారీ పోరాటం : కోదండరామ్
హైదరాబాద్, జూలై 12 (జనంసాక్షి) :
తెలంగాణ బంద్ విజయవంతమైంది. పది జిల్లాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. లోక్‌సభలో పోలవరం ఆర్డినెన్స్ బిల్లు ఆమోదానికి నిరసనగా టీ-జేఏసీ, వామపక్షాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించడంతో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో జన జీవనం స్తంభించింది. బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. శనివారం ఉదయాన్నే అఖిలపక్ష నేతలు, ఆందోళనకారులు రోడ్డెక్కారు. నిరసనలు, ఆందోళనలు, రాస్తారోకోలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. మోడీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏడు ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. డిపోల ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఎంజీబీఎస్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో ఆర్టీసీ భారీగా ఆదాయం కోల్పోయింది. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు తెరుచుకోలేదు. ఆర్టీసీ ముందుగానే పలు బస్సు సర్వీసులను రద్దు చేసింది. రవాణ సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల తెరిచి ఉంచిన షాపులు, స్కూళ్లను మూసివేయిస్తున్న, బస్సులను అడ్డుకున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
భద్రాచలం డివిజన్‌లోని పోలవరం ప్రాజెక్టు ముంపు పరిధిలోకి వచ్చే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ శుక్రవారం ఆమోదం తెలిపింది. తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల వ్యతిరేకతను పట్టించుకోకుండా సభ బిల్లును ఆమోదించింది. లక్షలాది మంది గిరిజనులను ముంచే పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ మార్చాలని మూడు రాష్ట్రాలు మొదటి నుంచి మొత్తుకుంటున్నాయి. డిజైన్ మార్చడం వల్ల ముంపు ప్రాంతాలను తగ్గించవచ్చనేది ఆయా రాష్ట్రాల వాదన. కానీ, కేంద్ ప్రభుత్వం ఏకపక్షంగా బిల్లును ఆమోదించడాన్ని నిరసిస్తూ టీ-జేఏసీ బంద్‌కు పిలుపునిచ్చింది. వామపక్షాలు కూడా బంద్‌కు పిలుపునిచ్చాయి. పోలవరం సవరణ బిల్లును ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కూడా బంద్‌కు మద్దతు తెలిపాయి. పలచోట్ల ఆందోళనలు, దిష్టిబొమ్మల దహనాలు చేపట్టాయి. హైదరాబాద్‌లో బంద్ ప్రభావం బాగానే కనిపించింది. ఎంజీబీఎస్, జేబీఎస్‌ల ఎదుట సీపీఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వివిధ జిల్లాలకు వెళ్లే బస్సు సర్వీసులను అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ జిల్లాలతో పాటు కర్నూలు, విజయవాడ నుంచి రాకపోకలు సాగించే బస్సులు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక సిటీబస్సులు కూడా నామమాత్రంగానే తిరిగాయి. ఉదయం పలు బస్ డిపోల వద్ద టీఆర్‌ఎస్, కాంగ్రెస్, వామపక్షాల కార్యకర్తలు బైఠాయించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అయితే, బస్సు సర్వీసుల్లో అంతరాయం కలిగినప్పటికీ ఎంఎంటీఎస్‌తో పాటు రైళ్లు యథతథంగా నడిచాయి.
ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
ఖమ్మం జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది. పోలవరం నిర్మాణం కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని నిరసిస్తూ అఖిలపక్షాల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు నిర్వహించారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. మాజీ మంత్రి రామిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పువ్వాడ అజయ్ తదితరులు హాజరయ్యారు. మా మండలాలను వదులుకోం, న్యాయపోరాటం చేస్తాం, పోలవరంపై కుట్రలను ఎదుర్కొంటామని వారు స్పష్టం చేశారు. ఖమ్మం బస్ డిపో ఎదుట వామపక్ష నేతలు బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో బంద్ విజయవంతమైంది. సిద్దిపేట, సంగారెడ్డి డిపోల ఎదుట జేఏసీ నేతలు, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నల్లగొండ జిల్లాలోనూ బంద్ ప్రభావం బాగా కనిపించింది. బస్సులు బయటకు రాకుండా ఉదయం నుంచే టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, జేఏసీ నేతలు డిపోల ఎదుట బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. జిల్లా వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి, బంద్‌లో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఆరు డిపోల్లోని 800 బస్సులు రోడ్డెక్కలేదు. నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి, బాన్సువాడ బస్టాండ్ల ఎదుట టీఆర్‌ఎస్, జేఏసీ నేలు ఆందోళనకు దిగారు. ఆర్మీసీ కార్మికులు కూడా బంద్‌కు మద్దతు తెలిపి ఆందోళనల్లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్‌లోనూ బంద్ ప్రభావం కనిపించింది. జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. కరీంనగర్ జిల్లాలో మంచి ప్రభావం కనిపించింది. జిల్లా వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి. విద్యాసంస్థలు మూతబడ్డాయి. బంద్‌కు మద్దతుగా కరీంనగర్ బస్టాండ్ వద్ద నిరసనకు దిగారు. హుజూరాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట తెలంగాణ వాదులు బైఠాయించారు. ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని అన్ని డిపోల ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆరు డిపోల్లోని 400 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. పెట్రోల్ బంకులు మూతబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడం అన్యాయమని, రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించడం సరికాదన్నారు. కేంద్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటికీ అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. లోక్‌సభలో పోలవరం ఆర్డినెన్స్ బిల్లు ఆమోదానికి నిరసనగా శనివారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జేఏసీతో పాటు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, వామపక్షాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసులను ముంచి ప్రాజెక్టు కడుతామంటే ఊరుకోబోమని స్పష్టం చేశారు. గిరిజనులను నిరాశ్రయులను చేసి నీటిని తరలించుకుపోతామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆదివాసీలను కాపాడేందుకు ప్రత్నామ్నయ మార్గాలు ఉన్నాయని.. వాటి గురించి ఎందుకు ఆలోచించడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని ప్రస్తుత డిజైన్‌కే తాము వ్యతిరేకమన్నారు. పోలవరం డిజైన్ మార్చి ప్రాజెక్టును నిర్మించాలని సూచించారు. డిజైన్ మార్చడం వల్ల ముంపు ప్రాంతాలను తగ్గించవచ్చన్నారు. కాంట్రాక్టర్లకు రూ.20 వేల కోట్లు పంచేందుకే పోలవరం నిర్మాణం చేపడుతున్నారని విమర్శించారు. తాగు, సాగునీటి కోసం ప్రత్యామ్నయ మార్గాలు ఉన్నాయని చెప్పారు. ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపి న్యాయం చేస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు. ఆంధ్రలో ఏడు మండలాలను విలీనం చేస్తూ తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సహా ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నా మందబలంతో బిల్లును ఆమోదింపజేసుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండా రాష్ట్ర సరిహద్దులను ఎలా మారుస్తారని ప్రశ్నించారు. ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాల సరిహద్దు మార్పుపై ఆయా రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవాల్సిందేనన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణ పట్ల మోడీ సర్కారు వివక్ష చూపుతోందన్నారు. రైల్వే బడ్జెట్‌లో, సాధారణ బడ్జెట్‌లో పెద్దగా నిధులు కేటాయించలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మూడు దశల్లో ఉద్యమిస్తామని కోదండరాం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. 14న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం పోలవరంపై వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.