దక్షిణాఫ్రికా యూఏఈపై ఘన విజయం
వెల్లింగ్టన్:ఊహించినట్లుగానే యూఏఈను దక్షిణాఫ్రికా దంచేసింది. కీలకమైన లీగ్ మ్యాచ్ లో దూకుడుగా ఆడిన సఫారీలు పసికూన యూఏఈపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ లో ఆపై బౌలింగ్ లోరాణించిన సఫారీలు 146 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో గ్రూప్ -బి నుంచి క్వార్టర్స్ కు చేరుకున్న రెండో జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. దక్షిణాఫ్రికా విసిరిన 341 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన యూఏఈ ఆదిలోనే తడబడింది. 29 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయిన యూఏఈ.. 45 పరుగుల వద్ద కీలకమైన మరో రెండు వికెట్లను కోల్పోయింది.
ఆ క్రమంలోనే మరో వికెట్ ను నష్టపోకుండా 100 పరుగుల మార్కును దాటింది. అయితే అటు తరువాత యూఏఈ 17 పరుగుల వ్యవధిలో మరో మూడు వికెట్లను కోల్పోయి ఒక్కసారిగా కష్టాల్లో పడింది. యూఏఈ ఆటగాళ్లలో షైమాన్ అన్వర్(39), అంజాద్ అలీ(21), పాటిల్(57*)పరుగులు మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు 47.3 ఓవర్లలో 195 పరుగులకే చాపచుట్టేసి ఘోర ఓటమి మూటగట్టుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోర్కెల్, డివిలియర్స్ ,ఫిలిండర్, చెరో రెండు వికెట్లు లభించగా, ఇమ్రాన్ తాహీర్, జేపీ డుమినీలకు తలో వికెట్ దక్కింది.