9స్థానాల్లో ఔటయ్యేదెవరో
మరోమారు క్లీన్‌స్వీప్ కోసం టిఆర్‌ఎస్ ఎత్తులు
నిజామాబాద్,ఆగస్ట్30(జనం సాక్షి): సెప్టెంబర్‌లోనే టిక్కెట్లు ఖరారు చేస్తామన్న సిఎం కెసిఆర్ ప్రకటనతో ఎమ్మెల్యేలు టెన్షన్లో పడ్డారు. సెప్టెంబర్‌లోనే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో అధికార పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇందులో ఎవరు ఉంటారు..ఎవరు పోతారన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో మొదటి విడతలో ఖరారయ్యే స్థానాలు మూడు నుంచి నాలుగు ఉండే అవకాశాలున్నాయనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మొదటి విడతలో ఎవరి స్థానం ఉంటుందా అని టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కొందరు ఎమ్మెల్యేలకు టికెట్ టెన్షన్ పట్టుకుంది. సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామని పేర్కొన్న కేసీఆర్.. మరోవైపు ఒకటీ రెండు చోట్ల మార్పులుంటాయనే సంకేతాలివ్వడం తెలిసిందే.దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలోని కొందరు ఎమ్మెల్యేలు అభ్యర్థిత్వంపై కొందరు అభద్రతాభావంతో ఉన్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మార్పు చేయాలని భావిస్తున్న సీట్లలో ఉమ్మడి జిల్లాకు చెందిన నియోజకవర్గాలేమైనా ఉంటాయా..? అనే అంశంపై పార్టీలో విశ్లేషణ సాగుతోంది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రెండు పార్లమెంట్ స్థానాల్లో కూడా గులాబీ జెండాను ఎగురవేసింది. రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన సీనియర్ నేతలున్న కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఖాతా కూడా తెరువలేక పోయింది. నిజామాబాద్ అర్బన్ వంటి పలు నియోజకవర్గాల్లో కొంత పట్టున్న బీజేపీ సైతం ఉనికి చాటుకోలేక పోయింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా గత ఫలితాలనే పునరావృతం చేయాలని అధికార పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళుతోంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వ, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు నిర్వహించుకుని వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుంటోంది. ఇందులో భాగంగానే ఆరు నెలల ముందుగానే అభ్యర్థుల ప్రకటన చేస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. మొత్తం విూదపార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రకటన పార్టీ శ్రేణుల్లో ఎన్నికల ఉత్సాహాన్ని నింపగా, ఎమ్మెల్యేల్లో మాత్రం టెన్షన్ మొదలైందనే చర్చ సాగుతోంది.సామాజిక సవిూకరణాలు, ఎలాంటి వివాదాలు లేని నియోజకవర్గాలు, అలాగే టిక్కెట్ కోసం పోటీ పడేఎలాంటి వివాదాలు లేని నియోజకవర్గాలు, అలాగే టిక్కెట్ కోసం పోటీ పడే నేతలు లేని నియోజకవర్గాలకు మొదటి జాబితాలో చోటు దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.