ఆశా కార్యకర్త పై చర్యలు తీసుకోవాలి

చెన్నారావుపేట, జనవరి 4 (జనం సాక్షి):
చెన్నారావుపేట ఎంపీడీవో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి ఫిర్యాదు…
ఆశా కార్యకర్త పై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ చెన్నారావుపేట మండల ఎన్నికల అధికారి, ఎంపీడీవో వెంకటశివానంద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని సరోజకు జీడిగడ్డ తండా గ్రామానికి చెందిన గుగులోతు బొంద్యాలు, గుగులోతు లచ్చిరాంలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మండల ఎన్నికల అధికారి, ఎంపీడీవో, వైద్యాధికారినికి వేరువేరుగా ఫిర్యాదులను అందజేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని జీడిగడ్డ తండా గ్రామంలో ఇస్లావత్ రూపావతి ఆశా కార్యకర్తగా పనిచేస్తుంది. వైద్య శాఖలో ఆశా కార్యకర్తగా ఉద్యోగం చేస్తూ ఇటీవల జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికలలో ఓ పార్టీ సర్పంచ్ అభ్యర్థి తరపున ఇంటింటికి తిరిగి ప్రచారం చేసింది. అంతేకాక గెలిచిన సర్పంచ్ విజయోత్సవ వేడుకలలో పాల్గొని నృత్యం సైతం చేసింది. వైద్యశాఖలో ఉద్యోగం చేసుకుంటూ ఓ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడం సరికాదని ఆమెను అడగగా నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను మీకు మాట్లాడే హక్కు లేదని దురుసుగా మాట్లాడిందని తెలిపారు. ఈ విషయంపై విచారణ జరిపి ఆశా కార్యకర్త విధుల నుండి రూపావతిని తొలగించి న్యాయం చేయాలని కోరుతూ ఫిర్యాదు చేసినట్లు వారు పేర్కొన్నారు.



