రవి ప్రచారంలో ఆప్యాయత.. మాటల్లో మమకారం

మోపాల్‌/నిజామాబాద్‌ (జనంసాక్షి) : ఇంటికి ఎవరొచ్చినా కలోగంజో పెట్టే గుణమున్న బున్నె రవికి కంజర్‌లో అడుగడుగునా ఆదరణ లభించింది. చిన్నా పెద్దా తేడాలేకుండా ముక్కుసూటి మనిషి అని అందరినోటా వినిపించింది. సుదీర్ఘ అనుభవంతో పాటు కష్టసుఖాల్లో పాలుపంచుకునే ఆయనకు సర్పంచ్‌గా పట్టం కట్టాలనే భావన వ్యక్తమైంది. గత కొన్నిరోజులుగా గల్లీగల్లీలో తిరుగుతూ ఇంటింటా ప్రచారం చేపట్టిన బున్నె రవిని పెద్దలు భారీఎత్తున ఆశీర్వదించారు. ప్రతి ఇంటా ఆయనను అక్కున చేర్చుకుని ‘బిడ్డా.. మా ఓటు నీకే.. నీ మంచితనం మాకు తెలుసు. ఏ రాత్రి పిలిచినా వెంటనే పలుకుతావు’ అంటూ గతంలో చేసిన పనులు, కష్టసుఖాల్లో భాగమైన సందర్భాలను గుర్తుచేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అన్ని తెలిసిన వ్యక్తిని గెలిపిస్తేనే ఊరు బాగుంటుందనే అభిప్రాయాలను వెలిబుచ్చారు. తప్పుడు హామీలు ఇస్తున్న అభ్యర్థులను, ఆచరణ సాధ్యంకాని చేయలేని మాటలు చెబుతున్నవారి పట్ల అన్ని గమనిస్తున్న స్థానిక ప్రజలు.. సౌమ్యుడిగా, అందరినోళ్లలో ఉండే మనిషిగా పేరొందిన బున్నె రవికే పట్టం కట్టాలనే యోచనలో ఉన్నారు. ప్రజల మనసులను డబ్బుతో కొనుగోలు చేయాలనుకునేవారి పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఊరి రాజకీయాలను కొందరు దురుద్దేశంతో భ్రష్టుపట్టిస్తున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో స్వతహాగా పనులు చేయగలిగే వ్యక్తినే ఆశీర్వదిస్తామనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనికితోడు సీనియర్‌ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువకులు ఆయనకు మద్దతుగా నిలవడంతో భవిష్యత్తులో అన్ని పనులు చేయగలరనే భరోసా గ్రామ ప్రజల్లో కనిపించింది.