కరీంనగర్‌లో బట్టబయలైన మరో భూకబ్జా కేసు
కరీంనగర్ బ్యూరో (జనంసాక్షి) : కరీంనగర్‌లో తేనెతుట్టెను కదిపిన చందంగా భూకబ్జాదారుల ఆగడాలు ఇంకా బట్టబయలవుతూనే ఉన్నాయి. నకిలీ పత్రాలతో భూమిని కాజేయాలనుకున్న ల్యాండ్ మాఫియా గుట్టు మరొకటి రట్టయ్యింది. పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేయగా.. తాజాగా శనివారం ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు. నిందితుల్లో ఒకరు మాజీమంత్రి గంగుల కమలాకర్‌కు చెందిన అనుచరుడు ఉన్నట్టు తెలుస్తోంది.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..
కరీంనగర్ ఫతేపురకు చెందిన షేక్ అబూబకర్ 1992లో రేకుర్తి శివారులోని సర్వే నంబర్ 79/2 లో గల 8.12 ఎకరాల భూమిని సాలెప్‌ా బి నుండి కొనుగోలు చేశారు. 1996లో వెంచర్‌గా మార్చి పలువురికి విక్రయించాడు. అందులో ప్లాట్ నెంబర్ 311లో గల 200 గజాల స్థలాన్ని 1996లో గొర్ల లక్ష్మికి, ఆమె ఆ స్థలాన్ని 2010లో మేడి శెట్టి లచ్చయ్యకు, మేడిశెట్టి లచ్చయ్య అతని అవసరాల నిమిత్తం 2011లో గుర్రం బాలనరేంధేర్‌కు విక్రయించాడు. ఈ ప్లాట్ నెంబర్ 311 పక్కనే గల 312, 313 ప్లాట్లలో 400 గజాల స్థలం యజమాని షేక్ అబూబకర్‌పైనే ఉంది. దాన్ని ఎవరికీ విక్రయించలేదు. అదే 400 గజాల స్థలాన్ని కాజేయాలనే దురుద్దేశంతో తన స్థలానికి పక్క ప్లాట్ యజమానిగా వున్న గుర్రం బాలనరేందర్ (37), గుర్రం రాజయ్య, ఉప్పు శ్రీనివాస్, చీటీ ఉపేందర్ రావులు పథకం పన్నారం. రేకుర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేశారు. తప్పుడు ఇంటి నెంబర్ సృష్టించారు. దానిద్వారా 2022లో గంగాధర సబ్ రిజిస్టర్ కార్యాలయం నుండి గిఫ్ట్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తర్వాత సప్లిమెంట్ డీడ్ ద్వారా 312, 313 ప్లాట్లను రిజిస్టర్ ఆఫీస్ నందు నమోదు చేపించి 312 నెంబర్ ప్లాటును చీటీ ఉపేందర్ రావు పేరున, 313 ప్లాట్‌ను ఉప్పు శ్రీనివాస్ పేరున మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ భూమి కోసం వస్తే చంపేస్తామని అసలు యజమానిని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బాధితుడు అబూబకర్ కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసుల విచారణలో బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు నిజమేనని తేలాయి. దీంతో గుర్రం బాలనరేందర్ (ఏ1), ఉప్పు శ్రీనివాస్ (ఏ3), చీటీ ఉపేందర్ రావు (ఏ4)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గుర్రం రాజయ్య (ఏ2) పరారీలో వున్నాడు. నిందితులపై కరీంనగర్ టూ టౌన్‌లో 420, 467, 468, 471, 120-బి, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.