ప్రజలను ఓదార్చడానికి వెళ్తున్న అఖిలపక్ష నాయకుల అరెస్టు

రాజోలి (జనంసాక్షి): అక్రమ కేసుల్లో బంధింపబడ్డ రైతుల కుటుంబాలను పరామర్శించడానికి వారిని ఓదార్చడానికి గద్వాల నుండి పెద్దదన్వాడ గ్రామానికి వెళ్తున్న అఖిలపక్ష పార్టీల నాయకులను శుక్రవారం ఐజలో అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇథనాయిల్ పరిశ్రమ ఏర్పాటును ఆపాలని శాంతియుతంగా పోరాడుతున్న రైతులను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపిన ప్రభుత్వ తీరు అప్రజాస్వామికం అన్నారు. రైతులపై దాడి చేసి వారిని గాయాల పాలు చేసిన పరిశ్రమ యాజమాన్య ప్రైవేటు వ్యక్తులపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. వ్యవసాయానికి అనుకూలమైన సాగుభూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించి ప్రశ్నించిన రైతులపై నియంతత్వంతో వ్యవహరిస్తున్న ప్రభుత్వ విధానాల వ్యతిరేకంగా ప్రజల ఐక్యం కావాలని అన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి దైర్యం చెప్పడానికి వెళుతున్న అఖిలపక్ష సామాజిక ప్రజా సంఘాల నాయకులను మార్గ మధ్య లోనే అరెస్టు చేయడం దారుణమన్నారు. తక్షణమే ఇథనాల్ పరిశ్రమ అనుమతిని రద్దు చేసి రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి వారిని విడుదల చేయాలని, లేనిపక్షంలో దీర్ఘ కాల ఉద్యమానికి సిద్ధం అవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు ఆంజనేయులు, వెంకటస్వామి,  జిల్లా కన్వీనర్ కుర్వ పళ్లయ్య, రైతాంగ సమితి జిల్లా కార్యదర్శి గోపాల్ యాదవ్, బహుజన రాజ్య సమితి నాయకులు వాల్మీకి, వినోద్, ఉప్పేర్, నరసింహ, దానయ్య, సుబాన్ తదితరులు పాల్గొన్నారు.