కవిత వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ జరుగుతున్న పరిణామాలు కేవలం కుటుంబ నాటకమని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో “కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్” పేరుతో ఒక నాటకం నడుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌లో ప్రస్తుతం “చార్‌పత్తా ఆట” సాగుతోందని, ఈ “కల్వకుంట్ల సినిమా”కు కాంగ్రెస్ పార్టీయే ప్రొడక్షన్ బాధ్యతలు చూస్తోందని ఆయన ఆరోపించారు.ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పటికీ ఒక్కటి కాలేవు అన్నారు. కవిత అరెస్టు కాకుండా ఉండేందుకు, తమ పార్టీతో కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేశారు. అయితే, అవినీతికి పాల్పడిన ఆ పార్టీతో తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కలవదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మాత్రమే గతంలోనూ, ఇప్పుడు కూడా కలిసి పనిచేశాయని ఆయన పునరుద్ఘాటించారు.