కర్నిలో ఘనంగా బీరప్ప బండారు మహోత్సవం పాల్గొన్న
మక్తల్, (జనంసాక్షి) : కురుమ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ బీర లింగేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా మక్తల్ మండలంలోని కర్నిలో సోమవారం బీరప్ప బండారు మహోత్సవం ఘనంగా జరిగింది. ఈనెల 12 నుంచి ప్రారంభమైన బీర లింగేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా కృష్ణానది నుంచి పవిత్ర జలాలను తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బీరప్ప భక్తులు బండారు( పసుపు ) చల్లుకొని బండారు మహోత్సవంలో తన్మయత్వం చెందారు. మహబూబ్ నగర్ ఎంపీ డీకే.అరుణ, మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి లు బండారు మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కురుమ కులస్తులకు బండారు చల్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే బీరప్ప బండారు మహోత్సవాన్ని కురుమ కులస్తులు ఇప్పటికీ ఏమాత్రం మరవకుండా ఘనంగా జరుపుకోవడం గర్వకారణం అన్నారు. వివిధ పనుల నిమిత్తం సుదూర ప్రాంతాలలో స్థిరపడినప్పటికీ బీరప్ప ఉత్సవాలకు ఒక చోటకు చేరి జనమంతా సంబరంగా జరుపుకోవడం విశేషం అన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనతో ముందుకు సాగితేనే ప్రపంచమంతా సుభిక్షంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఉత్సవాలలో భాగంగా మంగళవారం జమ్ములమ్మ పూజ, బుధవారం ఎల్లమ్మ బండారు ఉత్సవాలను నిర్వహించనున్నారు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, టిఎస్ టిపిసి మాజీ చైర్మన్ దేవరి మల్లప్ప, మాజీ ఎంపీపీ బి.కొండయ్య, బిజెపి జిల్లా అధ్యక్షులు సత్య యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గణేష్ కుమార్, మాజీ ఎంపిటిసి కోళ్ల వెంకటేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ ఎంపిటిసిలు బలరాం రెడ్డి, గాసం చిన్న రంగప్ప, వసంత గౌడ్, నారాయణ రెడ్డి, కృష్ణయ్య గౌడ్, నిర్వాహకులు నామాల బాలరాజు, వినోద్ కుమార్, గడ్డమీది రవి, పూజారి రంగప్ప, పాండప్ప, చిన్న నరసప్ప, రవికుమార్, పించర్ల రాము, చెవిటి లింగప్ప, గిల్లి నరసింహ, భీమేష్, కటికెలి హనుమంతు, గాజుల మహబూబ్, గ్రామస్తులు పాల్గొన్నారు.