రాజ్యాంగ వ్యవస్థల్ని ధ్వంసం చేసేందుకు భాజపా కుట్ర
` బిహార్‌లో ఓట్ల చోరీ కానివ్వం
` ఎస్‌ఐఆర్ అసలు రంగును బయటపెడతాం
` ’ఓటర్ అధికార్ యాత్ర’ప్రారంభోత్సవంలో రాహుల్ గాంధీ
న్యూఢల్లీి(జనంసాక్షి):ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ఆరోపణలను తీవ్రతరం చేశారు. ఓట్ల విషయంలో భాజపాతో కలిసి ఈసీ అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఇప్పుడు యావత్ దేశానికి తెలిసిందన్నారు.బిహార్‌లోని సాసారం నగరంలో ‘’ఓటర్ అధికార్ యాత్ర’’ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ పేరిట బిహార్‌లో ఓట్ల తొలగింపు, చేర్పుల వంటి కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. ‘ఇండియా’ కూటమి దీనికి అనుమతించబోదని, పేదల ఓటు అధికారాన్ని వారి నుంచి దూరం కానివ్వబోదన్నారు.‘’దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు చోరీకి గురవుతున్నాయి. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి సత్తా చాటింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మాదే విజయమనే అంచనాలు వెలువడ్డాయి. కానీ, నాలుగు నెలల్లోనే కోటి మంది ఓటర్లు వచ్చి చేరడంతో.. భాజపా కూటమి గెలిచింది. ఎక్కడైతే ఓట్లు పెరిగాయో.. అక్కడ కాషాయ పార్టీ గెలిచింది. ఈసీ ఏం చేస్తోందో ఇప్పుడు అందరికీ తెలిసింది. ఓట్ల చోరీ ఆరోపణలపై ఎన్నికల సంఘం నా నుంచి అఫిడవిట్ కోరింది. భాజపా నేతలూ అదే విధమైన వాదనలు చేస్తే.. ఆ ప్రస్తావనే తీసుకురాలేదు. భాజపా, ఆరెస్సెస్‌లు రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నాయి’’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు.కేంద్రంలో భాజపా నేతృత్వంలోని సర్కారు అధికారంలో ఉన్నంత కాలం రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రజల ఓటు హక్కును లాక్కునేందుకు యత్నిస్తోందన్నారు. ఎన్నికల సంఘం భాజపా ప్రభుత్వానికి ఏజెంట్‌లా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. బిహార్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎన్డీయే సర్కారును గద్దెదించుతారన్నారు. మరోవైపు.. బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజల ఓటు హక్కును కాలరాసేందుకు ఎన్నికల సంఘాన్ని ఉపయోగిస్తోందని ఆయన ఆరోపించారు.