కొత్తూరు వై జంక్షన్‌లో డీసీఎం.. రెండు లారీలు ఢీ.. బైకర్ మృతి
లారీ డ్రైవర్ నిర్లక్షానికి నిండు ప్రాణం బలైంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు వై జంక్షన్ వద్ద ఓ డీసీఎం యూటర్న్ తీసుకుంటున్నది. అదే సమయంలో పైపుల లోడుతో వస్తున్న కంటైనర్ డ్రైవర్ దగ్గరికి వచ్చిన తర్వాత దానిని గమనించాడు. వెంటనే కుడివైపు లారీని తిప్పాడు. దీంతో డీసీఎంను ఢీకొట్టుకుంటూ రోడ్డుకు అవతలివైపు వెళ్లిన కంటైనర్.. కాటన్ లోడుతోవెళ్తున్న లారీని ఢీకొట్టింది. అదే వైపు నుంచి స్కూటీ వైళ్తున్న అంజయ్యపై లారీ పడిపోయింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. స్కూటీ వెనక సీట్‌లో కూర్చున్న మరో వ్యక్తి తీవ్రగా గాయపడ్డాడు. ఈ విషాద ఘటన శుక్రవారం మధ్యాహ్నం 2.14 గంటలకు జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
అసలు ఏం జరిగిందంటే..
స్క్రాప్ డీసీఎం కొత్తూరు టౌన్ నుంచి, వై జంక్షన్ వద్ద హైవేపై యూటర్న్ అవుతుంది. అదే సమయంలో కర్నూల్ నుంచి హైదరాబాద్ వైపు పైపుల లారీ కంటైనర్ ను డ్రైవర్ ప్రహాల్లాద అతివేగంగా నడుపుకుంటూ వచ్చి కుడివైపు టర్న్ చేస్తూ స్క్రాప్ డీసీఎంను ఢీ కొట్టుకుంటూ హైదరాబాద్ నుంచి కర్నూల్‌కు వెళుతున్న కాటన్ దిమ్మెల లారీని కూడా ఢీకొట్టాడు. లారీ ఎడమవైపు పల్టీ కొట్టింది. అదే వైపు నుంచి స్కూటీ నడుపుకుంటూ వెళ్తున్న పెంజర్ల గ్రామానికి చెందిన కందివనం అంజయ్య పై పడింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. స్కూటీ వెనుక ఉన్న దినేష్‌కు గాయాలు అయ్యాయి. అలాగే కంటైనర్ డ్రైవర్ ప్రహాల్లాద కూడా గాయపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కొత్తూరు సీఐ నరసింహారావు తెలిపారు.