సీనీప్రముఖులకు ఈడీ షాక్
` రానా,విజయ్ దేవరకొండ,ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీలకు నోటీసులు
` విచారణకు రావాలని ఆదేశం
` బెట్టింగ్ యాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్(జనంసాక్షి): బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ అధికారులు సినీ సెలబ్రిటీలకు షాక్ ఇచ్చారు. ఈ కేసులో ముమ్మరంగా విచారణ చేస్తున్న క్రమంలో బెట్టింగ్ యాప్ కేసులో నిందితులుగా ఉన్న సినీ సెలబ్రెటీలకు సోమవారం నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే పలువురిని పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దగ్గుబాటి రానా, ప్రకాష్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీప్రసన్న విచారణకి హాజరవ్వాలని ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. జులై 23న దగ్గుబాటి రానా, జులై30న ప్రకాష్‌రాజ్, ఆగస్ట్6న విజయ్ దేవరకొండ, ఆగస్ట్ 13న మంచు లక్ష్మీప్రసన్న విచారణకి హాజరవ్వాలని నోటీసులో తెలిపారు. విదేశీ బెట్టింగ్ యాప్‌లను వీరు ప్రమోట్ చేసినట్లు- ఈడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో వీరిని మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు విచారణ చేయనున్నట్లు- తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఆయా కంపెనీల నుంచి సినీ సెలబ్రెటీలకు నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై విచారణ చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. సినీ సెలబ్రెటీలు బెట్టింగ్ యాప్‌లని ప్రమోట్ చేయడంతోనే పలువురు ఆకర్షితులు అయ్యారని ఈడీ అధికారులు, పోలీసులు చెబుతున్నారు. బెట్టింగ్ యాప్‌లలో పెట్టుబడి పెట్టి అమాయకులు మోసపోయినట్లు అధికారులకి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో ఈడీ అధికారులు, పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఎంతోమంది బెట్టింగ్ యాప్‌ల బారిన పడి ఆత్మహత్యలు చేసుకోవడంతో ఈడీ అధికారులు, పోలీసులు ఈ కేసుని సీరియస్‌గా తీసుకుని విచారణ జరుపుతున్నారు.