హోర్ముజ్ తెరవకున్నా.. యుద్ధాన్ని ఆపేస్తాం
మార్చి 31 (జనం సాక్షి):ఒకవేళ హోర్ముజ్ జలసంధిని ఇరాన్ తెరవకున్నా.. ఆ దేశంపై చేపట్టిన యుద్ధాన్ని నిలిపివేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన సహచరులతో వెల్లడించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కథనాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ రాసింది. హోర్ముజ్‌ను మరో సందర్భంలో తెరిచేందుకు వత్తిడి చేయనున్న ఆ కథనంలో పేర్కొన్నారు. ట్రంప్ సర్కారులో ఉన్న అధికారులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హోర్ముజ్ జలసంధిని విదేశీ నౌకలకు ఓపెన్ చేసే వరకు ఇరాన్ అంతుచూస్తామని ట్రంప్ పదేపదే వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్‌పై ఆపరేషన్‌ను కేవలం నాలుగు నుంచి ఆరు వారాల వరకు మాత్రమే అంచనా వేసి అమెరికా దాడులకు దిగింది. ఒకవేళ జలసంధి అంశంలో సందిగ్ధత కొనసాగితే యుద్ధం ముగింపు మరింత ఆలస్యం అవుతుందని, దీని వల్ల టైమ్‌లైన్ కూడా దాటినట్లు అవుతుందని అమెరికా అంచనా వేస్తున్నది. ఇరాన్ నేవీని దెబ్బతీయడం, క్షిపణి నిల్వలను పేల్చివేయడం లాంటి నిర్ణయాలను వేగవంతం చేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు కూడా ఆ కథనంలో తెలిపారు. అయితే వాణిజ్యం అంశంలో టెహ్రాన్‌తో దౌత్యపరమైన వత్తిడి తీసుకువచ్చి ఉద్రిక్తతలను తగ్గించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు రిపోర్టులో చెప్పారు.
[ఇరాన్‌లో మిలిటరీ ఆపరేషన్‌కు నాలుగు నుంచి ఆరు వారాల సమయాన్ని కేటాయించారని, ఈ విషయాన్ని పలుమార్లు ట్రంప్‌తో పాటు పెంటగాన్ చీఫ్ కూడా వెల్లడించాని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లివియట్ వెల్లడించారు. ప్రస్తుతం యుద్ధం 30వ రోజుకు చేరుకున్నదని, ఇరాన్ యుద్ధ భారాన్ని అరబ్ దేశాలు కూడా పంచుకునే రీతిలో చర్యలు తీసుకుంటున్నట్లు లివియట్ తెలిపారు. ఈ అంశంలో అధ్యక్షుడు ఆసక్తికర విషయాన్ని చెప్పనున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు అటాక్ చేశాయి. ఆ తర్వాత ఇరాన్ ప్రతిదాడితో ఆ ఉద్రిక్తతలు యావత్ గల్ఫ్ ప్రాంతాన్ని చుట్టేశాయి. ప్రపంచదేశాలకు చమురు అందించడంలో కీలకమైన హోర్ముజ్ జలసంధి అంశంలో తీవ్ర పోరు జరిగింది. హోర్ముజ్‌ను ఇరాన్ మూసివేయడం వల్ల వందల సంఖ్యలో చమురు నౌకలు ఆ జలసంధిలోనే స్తంభించిపోయాయి.
మరో వైపు హోర్ముజ్ జలసంధి నుంచి వెళ్లే నౌకల వద్ద టోల్ పన్ను వసూల్ చేయాలని ఇరాన్ భావిస్తున్నది. నౌకలపై వేసే టోల్ ట్యాక్స్ బిల్లుకు ఇరాన్ పార్లమెంటరీ కమిటీ నుంచి ఆమోదం దక్కినట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పేర్కొన్నది. పన్ను వసూల్‌కు అప్రూవల్ దక్కిన విషయాన్ని జాతీయ భద్రతా కమిషన్ సభ్యుడు ఒకరు వెల్లడించారు. ఆ జలసంధి నుంచి అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు అనుమతి ఉండదని కూడా చెప్పారు. కొత్త ప్లాన్ ప్రకారం ఇరాన్‌పై ఆంక్షల అంశంలో భాగస్వామ్యమైన దేశాల నౌకలను కూడా జలసంధి నుంచి వెళ్లనివ్వరు. నూతన టోల్ విధానం గురించి ఇరాన్ ప్రభుత్వ టీవీలో ప్రకటన చేశారు. ఒమన్ దేశ సహకారంతో ఆ పన్ను విధింపు ప్రక్రియను ఇరాన్ అమలు చేయనున్నది. ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న జలసంధి నుంచే ప్రపంచంలోని సుమారు 20 శాతం క్రూడ్ ఆయిల్ నౌకలు వెళ్తాయి. అయితే ఇరాన్ వార్ మొదలైన తర్వాత ఆ సంధి నుంచి సుమారు 95 శాతం షిప్పింగ్ నిలిచిపోయింది.


