మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డికి షాకిచ్చిన అన్నదాతలు

ఆర్మూర్‌ : మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. రుణమాఫీ కోసం ఆర్మూర్‌ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద బైఠాయించిన నిరసన తెలుపుతున్న అన్నదాతలకు మద్దతుగా వెళ్లగా.. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డికి భంగపాటు. రైతు రుణమాఫీ, రైతు భరోసా పూర్తి స్థాయిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించాలని ఆర్మూర్‌, బాల్కొండ, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల రైతులు చేపట్టిన నిరసన దీక్ష కాస్త రాజకీయ రగడ అమలుకుంది. రైతుల నిరసన దీక్షకు బిఆర్‌ఎస్‌ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఆశన్న గారి జీవన్‌ రెడ్డి రావడంతో అక్కడ రాజకీయ దీక్షగా మారింది. ఈ క్రమంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడేందుకు ప్రయత్నించగా.. రైతులు ఒక్కసారిగా పైకి లేచారు. పదేళ్లలో రైతులకు మీరు కూడా చేసిందేమీ లేదని, ఇక్కడ మీరు మాట్లాడొద్దని కూర్చున్న రైతులు కాస్త లేచి నిలబడి ఆయనను నిలదీయడం గమనార్హం. ఈ సందర్భంగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి. ఎకరానికి 7500 రూపాయల చొప్పున రుణ భరోసా నిధులు విడుదల చేయాలని అన్నదాతలు డిమాండ్‌ చేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.