పెన్షన్లు, రైతుబంధు భారీగా పెంపు

హైదరాబాద్‌ : పెన్షన్లు, రైతుబంధు, రైతు బీమా విషయంలో సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వాటికి పెంచే వివరాలను మేనిఫెస్టోలో ప్రకటించారు. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ రైతు బీమా తరహా ఎల్‌ఐసీ ద్వారా రూ.5 లక్షల జీవితబీమా అందించనున్నారు. ఆసరా పెన్షన్లను ఐదేండ్లలో 5 వేల రూపాయలకు తీసుకెళ్తామని, మొదటి సంవత్సరం వెయ్యి పెంచుతామని, అంటే 3,016 రూపాయలకు పెంచుకుంటామని తెలిపారు. దివ్యాంగులకు పెన్షన్‌ ఈ మధ్యనే 4,016 రూపాయలకు పెంచామని, రాబోయే ఐదేళ్లలో 6,016 రూపాయలకు పెంచుతామని తెలిపారు.
బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాగానే రైతుబంధు సాయాన్ని మొదటి సంవత్సరం ఎకరానికి ఏటా 12,000 రూపాయలకు పెంచుతుందని హామీ ఇస్తున్నట్టు సీఎం తెలిపారు. వచ్చే ఐదేండ్లలో రైతుబంధు సహాయాన్ని క్రమంగా పెంచుతూ.. గరిష్టంగా ఎకరానికి ఏటా 15,000 రూపాయలకు పెంచుతం అని హామీ ఇస్తున్నామని, ధాన్యం కొనుగోలు పాలసీని యధావిధిగా కొనసాగిస్తామని తెలిపారు.