IDBI బ్యాంకుల్లో భారీ కుంభకోణాలు

బ్యాంకుల్లో కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో మొదలైన అలజడి కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు ఏ బ్యాంక్ స్కాం వెలుగులోకి వస్తుందో అని అందరూ ఆందోళనగా ఉన్నారు. అలాంటిదే ఇప్పుడు IDBI బ్యాంక్ లో జరిగింది. రూ.600 కోట్ల అప్పు ఎగవేతకి సంబంధించి కుంభకోణం బయటపడింది. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసింది. విచారణ చేపట్టింది. ఇక్కడ షాకింగ్ ఏంటంటే.. ఈ రూ.600 కోట్ల అప్పు ఎగవేత వెనక బాగోతం నడిపింది అంతా కూడా ఆ బ్యాంక్ ఉన్నతాధికారులు, సిబ్బంది కావటం విశేషం.
ఎయిర్ సెల్ మాజీ ప్రమోటర్ సి.శివశంకర్ 2014, ఫిబ్రవరిలో IDBI నుంచి రూ.530 కోట్ల అప్పు తీసుకున్నారు. అప్పటి నుంచి చెల్లింపులు చేయటం లేదు. వడ్డీతో సహా ఇప్పుడు రూ.600 కోట్లు అయ్యింది. దీంతో బ్యాంక్ మొండి బకాయిగా తేల్చింది. ఈ అప్పు మంజూరులో సిండికేట్ బ్యాంక్ ఎండీ, సీఈవో మెల్విన్ రెగో, ఇండియన్ బ్యాంక్ ఎండీ, సీఈవో కిశోర్ ఖారత్‌ పాత్ర ఉన్నట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం సిండికేట్ బ్యాంక్ ఎండీ అయిన మెల్విన్ రెగో.. అప్పట్లో IDBI డిప్యూటీ ఎండీగా ఉన్నారు. ఖారత్ అప్పట్లో IDBI సీఈవో. వీళ్లద్దరూ నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్ సెల్ మాజీ ప్రమోటర్ శివశంకరన్ కంపెనీల్లోకి నిధులు తరలించారు. వీరితోపాటు.. IDBI సీఎండీ ఎంఎస్ రాఘవన్ తోపాటు 15 మంది సీనియర్ అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులపైనా సీబీఐ కేసు నమోదు చేసింది. ఇక అప్పు తీసుకున్న శివశంకరన్ కుమారుడు సహా 24 మంది ప్రైవేట్ వ్యక్తులనూ నిందితులుగా చేర్చారు.
నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి అభియోగాల కింద సీబీఐ కేసులు నమోదు చేసింది. విన్ విండ్ ఓయ్ ఫిన్లాండ్, ఎక్సెల్ సన్‌షైన్ లిమిటెడ్ ఖాతాల ద్వారా బ్రిటష్ వర్జిన్ ఐస్‌లాండ్స్ ఆధారిత ఎక్సెల్ సన్‌షైన్ లిమిటెడ్ మోసం చేసిందంటూ తమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది సీబీఐ. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి ఇళ్లల్లో తనిఖీలు చేసింది సీబీఐ. ఢిల్లీ, ఫరీదాబాద్, ముంబై, గాంధీనగర్, చెన్నై, బెంగళూరు, బెల్గాం, హైదరాబాద్, జైపూర్, పుణె నగరాల్లో సోదాలు జరిగాయి.