జీతం రాలేదని అడిగితే ఉద్యోగం నుంచే పీకేశారు
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమం నామమాత్రంగానే మారిపోయిందని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజాభవన్‌కు వచ్చి దరఖాస్తులు చేసుకుంటున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా వాణిలో ఫిర్యాదు చేస్తే సమస్యలకు పరిష్కారం దొరకాల్సిందిపోయి.. కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. తాజాగా జీతం రాలేదని అడిగినందుకు ఓ మహిళా ఉద్యోగిని ఉద్యోగం నుంచి తీసేశారు.మేడ్చల్ జిల్లాకు చెందిన రేణుక హైదరాబాద్‌లోని నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నది. ఆమె జీతం రూ.15వేలు కాగా.. ఏజెన్సీ మాత్రం వేతనంలో కోత పెట్టి రూ.10 వేలు మాత్రమే ఇస్తున్నది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన రాలేదు. దీంతో ప్రజా భవన్‌కు వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఏజెన్సీ ఆ మరుసటి రోజే రేణుకను ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో మంగళవారం సాయంత్రం ప్రజాభవన్‌కు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తిరిగి ఇప్పించాలని కోరారు.ఈ ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతం రావడం లేదని ప్రజావాణిలో ఫిర్యాదు చేసినందుకు ప్రభుత్వం ఉద్యోగంలో నుంచే తీసేసిందని మండిపడ్డారు. ప్రజా వాణిలో ఆర్భాటం ఎక్కువ.. పరిష్కారం తక్కువగా ఉందని విమర్శించారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన అని ఎద్దేవా చేశారు. రేణుకను ఉద్యోగంలో నుంచి తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారిని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమంది పేదలకు ప్రజా దర్బార్ వల్ల సమస్యలు పరిష్కారమయ్యో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.