భూపాలపల్లిలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకొని భూపాలపల్లి పట్టణంలోని బస్టాండ్ సమీపంలో రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాటు చేయగా, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావులు ముఖ్యఅతిథిగా హాజరై ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు, ఆత్మగౌరవ ప్రతీక, వీరనారి చాకలి ఐలమ్మ అని, వారందించిన పోరాట స్ఫూర్తిని స్మరించుకోవాలని అన్నారు. అణిచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల తిరుగుబాటు తత్వానికి, ప్రతిఘటనా పోరాటానికి ఐలమ్మ స్ఫూర్తిగా నిలిచారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బుర్ర కొమురయ్య, కౌన్సిలర్లు ముంజాల రవీందర్, దాట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.