జనంసాక్షి సర్వే ఎట్లుంది..?

హైదరాబాద్‌ : ‘‘అవునూ.. జనంసాక్షి సర్వే ఎట్లుంది..? ఎవరికి మెజారిటీ ఇస్తుంది..? ఎక్కడెక్కడ ఎవరు గెలుస్తుండ్రు..? ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతుండ్రు..? సర్వేలో ఇంకేం విషయాలు తెలిశాయి? ఓటర్ల నాడీ ఎట్లుంది..? ఇంతకీ, సర్వే ఫలితాలను ఎప్పుడు రిలీజ్‌ చేస్తారు..?’’ గతకొన్ని రోజులుగా తెలంగాణవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే చర్చ..! రెండువారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి జనంసాక్షి సేకరించిన ఓటర్ల అభిప్రాయం ఎటువైపు ఉందో తెలుసుకోవాలనే కుతూహలం వేనోళ్లా వినిపించింది. ప్రజలూ, ప్రజాప్రతినిధులూ, శ్రేయోభిలాషులూ, విశ్లేషకులూ, విమర్శకుల్లో ఇదే ఆసక్తి కనిపించింది. గత కొన్నేళ్లుగా వివిధ ఎన్నికల్లో శాస్త్రీయ పద్ధతుల్లో సర్వేచేసిన ఫలితాలు వాస్తవికతకు దగ్గరగా రావడమే ‘జనంసాక్షి’ సర్వే పట్ల ఈ ఉత్సుకతను రేకెత్తించింది.
తెలంగాణ పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా 17 నియోజకవర్గాల్లో జనంసాక్షి చేపట్టిన సర్వే మళ్లీ విజయవంతమైంది. ఏయే స్థానాల్లో ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ముందే పసిగట్టిన సంస్థ.. ఆ ఫలితాలను బ్యాలెట్‌ పత్రాల్లో నిక్షిప్తం చేసింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రోజంతా ఎండనకా, వాననకా చేసిన సర్వే బృందం వాటిని వెన్వెంటనే విశ్లేషించింది. అనుమానం వచ్చిన మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలోని గజ్వేల్‌, సిద్దిపేటలో రెండురోజుల పాటు తిరిగి సర్వే చేపట్టగా.. ఓవరాల్‌గా బీజేపీకి అనుకూలంగా పరిస్థితులు కనిపించాయి. ఫలితాల్లోనూ ఇదే విషయం రూఢీ అయ్యింది. మరో మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్టుగా వచ్చిన ఫలితం.. చివరకు కాంగ్రెస్‌వైపై మొగ్గే అవకాశాలున్నట్టు జనంసాక్షి పేర్కొంది. మొత్తంగా 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు గరిష్టంగా 8 స్థానాలు, బీజేపీకి కనిష్టంగా 8 స్థానాలు, బీఆర్‌ఎస్‌కు కనిష్టంగా సున్నా, ఎంఐఎంకు కనిష్టంగా ఒక స్థానం రానున్నట్టు జనంసాక్షి వెల్లడిరచింది. ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన తుది ఫలితాల్లో సరిగ్గా జనంసాక్షి పేర్కొన్నట్టే ఫలితాలు వెలువడటం సంస్థ విశ్వసనీయతను మరింత పెంచిందని విశ్లేషకులు చెబుతున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి లక్షలాది మంది నుంచి శాంపిల్స్‌ సేకరించడం తెలంగాణలో ఒక్క ‘జనంసాక్షి’కే సాధ్యమవుతోందని పలువురు ప్రశంసిస్తున్నారు. నిజానికి ఇప్పటివరకు జనంసాక్షి చేపట్టిన ప్రతి సర్వే విజయవంతం కావడం, విమర్శకులు సైతం సంస్థ వెల్లడిరచే ఫలితాలను విశ్వసించడం గమనార్హం. సర్వేకు వెళ్తున్న సందర్భంగా పట్టణం మొదలు మారుమూల పల్లెదాకా ‘జనంసాక్షి’ సర్వే గురించి తమకు తెలుసంటూ ఓటర్లు, సామాన్యులు చెబుతుండటం విశేషం..!