ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి

న్యూఢిల్లీ (జనంసాక్షి) : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని ఇండియా కూటమి ఖరారు చేసింది. తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి పేరును ఇండియా కూటమి మంగళవారం ఖరారు చేసింది. దేశంలో ఉత్తమ న్యాయమూర్తుల్లో ఒకరిగా పేరొందిన ఆయన.. ఎన్నో చారిత్రాత్మక తీర్పులిచ్చారు. సల్వాజుడుం రద్దులో కీలక పాత్ర పోషించారు.

న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా కూడా హైకోర్టులో సేవలు అందించారు. సామాన్యులకు పెద్దపీట వేశారన్న పేరు తెచ్చుకున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి 2007 నుండి 2011 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ సమయంలోనూ పలు కీలక తీర్పులు ఇచ్చారు. పదవీ విరమణ అనంతరం గోవా తొలి లోకాయుక్తగా ఆయన పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాదులోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. నల్సార్ లా కాలేజీలో ఆయన పలు ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. తాజాగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడంపై న్యాయవాదులు, న్యాయవాద సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా తొలిసారి తెలంగాణ వాసికి ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వం రావడం సంతోషకరమని పలువురు వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి తరఫున తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆయనను ఏకగ్రీవంగా బలపరుద్దామని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన కొద్ది సమయంలోనే ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడం విశేషం.