Malaysia Masters Badminton 2022: సింధు శుభారంభం

మళ్లీ తొలి రౌండ్‌లోనే ఓడిన సైనా

మలేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్స్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఏడో ర్యాంకర్‌ పీవీ సింధు 21–13, 17–21, 21–15తో తొమ్మిదో ర్యాంకర్‌ హి బింగ్‌ జియావో (చైనా)పై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరింది.

ఈ గెలుపుతో ఇటీవల ఇండోనేసియా ఓపెన్‌–1000 టోర్నీలో హి బింగ్‌ జియావో చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకుంది. మరో మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ సైనా నెహ్వాల్‌ 21–16, 17–21, 14–21తో కిమ్‌ గా యున్‌ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. గతవారం మలేసియా ఓపెన్‌ సూపర్‌–750 టోర్నీలోనూ సైనా తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది.

సాయిప్రణీత్‌ ముందంజ
పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, ప్రణయ్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరగా… సమీర్‌ వర్మ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్‌ 21–8, 21–9తో కెవిన్‌ కార్డన్‌ (గ్వాటెమాలా)పై, కశ్యప్‌ 16–21, 21–16, 21–16తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై, ప్రణయ్‌ 21–19, 21–14తో బ్రైస్‌ లెవెర్‌డెజ్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించారు. సమీర్‌ వర్మ 21–10, 12–21, 14–21తో నాలుగో సీడ్‌ చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్‌) ద్వయం 19–21, 21–18, 16–21తో ఫాబ్రియానా కుసుమ–
అమాలియా ప్రాతవి (ఇండోనేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది.