అధికారులు జవాబుదారీగా పనిచేయండి

` అన్ని శాఖల సమన్వయంతోనే అద్భుత ఫలితాలు
` 3 నెలలకోసారి కార్యదర్శుల పనితీరుపై సమీక్షిస్తా
`ప్రతినెలా వారు సీఎస్‌కు నివేదిక సమర్పించాలి
` తెలంగాణకు స్పష్టమైన విజన్‌ తెలంగాణ రైజింగ్‌
` అన్ని శాఖలకు సంబంధించి పాలసీ
` క్యూర్‌, ప్యూర్‌, రేర్‌గా విభజించి అభివృద్ధికి ప్రణాళికలు
` ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట ఉద్యోగుల వివరాలు ఇవ్వండి
` అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు తరలించండి
` అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్‌(జనంసాక్షి): అధికారులు సమన్వయం చేసుకొని పనిచేయడం కీలకమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిఅన్నారు. సచివాలయంలోని అన్ని విభాగాల కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. శాఖల మధ్య, అధికారుల మధ్య సమన్వయం లేకపోతే ఎలాంటి ఫలితాలు రావని సీఎం అన్నారు. ప్రతి నెలా కార్యదర్శుల పనితీరుపై సీఎస్‌ సమీక్షిస్తారని తెలిపారు. ప్రతి నెల కార్యదర్శులు.. సీఎస్‌కు నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. ప్రతి 3 నెలలకోసారి కార్యదర్శుల పనితీరుపై స్వయంగా సమీక్షిస్తానని సీఎం చెప్పారు.‘‘అధికారులు సమన్వయం చేసుకొని పనిచేయడం కీలకం. అభివృద్ధి విషయంలో సమన్వయం కోసం మెకానిజం ఉండాలి. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయ్యింది. రెండేళ్లలో కొన్ని విజయాలు సాధించాం.. ప్రణాళికలు రూపొందించుకున్నాం. గతంలో ఎనర్జీ, ఎడ్యుకేషన్‌, ఇరిగేషన్‌, హెల్త్‌ పాలసీలు లేవు. దీంతో అనేక సమస్యలు వచ్చాయి. ముఖ్యమైన విభాగాలకు పాలసీలు తీసుకొచ్చాం. తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ విడుదల చేశాం. రాష్ట్రాన్ని క్యూర్‌, ప్యూర్‌, రేర్‌గా విభజించి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. స్పష్టమైన విధానాలతో ముందుకెళ్తున్నాం. గొప్ప కార్యాచరణ అమలుకు అధికారుల సహకారం ఉండాలి’’ అని సీఎం అన్నారు. సమావేశంలో సీఎస్‌ రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తెలంగాణకు స్పష్టమైన విజన్‌ తెలంగాణ రైజింగ్‌
ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయింది. ఈ రెండేళ్లలో కొన్ని విజయాలు సాధించాం. కొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాం అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. గతంలో ఎనర్జీ, ఎడ్యుకేషన్‌, ఇరిగేషన్‌, హెల్త్‌ లాంటి వివిధ శాఖలకు సంబంధించి ఒక పాలసీ లేకపోవడంతో కొన్ని సమస్యలు వచ్చాయన్నారు. అందుకే ముఖ్యమైన విభాగాలకు ఒక పాలసీని తీసుకున్నాం. రాష్టాన్రికి ఒక పాలసీ ఉండాలని తెలంగాణ రైజింగ్‌ `2047 విజన్‌ డాక్యుమెంట్‌ను విడుదల చేశామన్నారు. రాష్టాన్న్రి క్యూర్‌, ప్యూర్‌, రేర్‌గా విభజించి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. స్పష్టమైన విధి విధానాలతో మేము ముందుకు వెళ్తున్నాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఆయా శాఖల్లో పనులు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. శాఖల మధ్య సమన్వయంపై కీలక సూచనలు చేశారు. ప్రతీ సెక్రటరీ వారి వారి శాఖల్లో ఉన్న రెగ్యులర్‌, ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు సంబంధించి పూర్తి వివరాలు జనవరి 26వ తేదీలోగా సీఎస్‌కు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు అందాల్సిన జీతాలు, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ సదుపాయం అందుతున్నాయో లేదో సంబంధిత శాఖల హోచ్‌వోడీలు వెరిఫై చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పక్రియను జనవరి 26వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. జనవరి 26వ తేదీలోపు అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను వెంటనే ఖాళీ చేసి ప్రభుత్వ భవనాల్లోకి మారాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ’

పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
` నూతన సర్పంచ్‌లకు సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ తన సత్తా చాటింది. ఈ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు.. మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి సీఎం రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మంచి పాలన అందించి, పంచాయతీలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దుతారని.. విూరంతా ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తన ఎక్స్‌ ఖాతా వేదికగా పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వారందరికీ సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో.. నవంబర్‌ 11, 14, 17 తేదీల్లో జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుని అగ్రస్థానంలో నిలిచింది. మూడు దశల్లో మొత్తం 6821 స్థానాల్లో గెలుపొందింది. ఇక ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ 3520 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 703 స్థానాల్లో గెలిచింది. ఇతరులు 1654 స్థానాలను గెలుచుకున్నారు.